Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్క గెలుపు ఎన్నో సమీకరణాలు మార్చేస్తుంది. శత్రువుల్ని మిత్రులుగా, మిత్రుల్ని శత్రువులుగా మార్చినా ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆర్కే నగర్ ఎన్నికల్లో దినకరన్ గెలుపు కూడా ఇలాంటి పరిస్థితికి దారి తీసేలా వుంది. సిఎం పళనిస్వామి సర్కార్ లో భాగం అయిన కొందరు మంత్రులు, ఓ 30 మంది ఎమ్మెల్యేలు నిన్నమొన్నటిదాకా దినకరన్ ని మీద ఏ స్థాయిలో విమర్శలు చేశారో చూసాం. వారిలో కొందరు ఇప్పుడు పళనిస్వామి కి గుడ్ బై కొట్టి దినకరన్ క్యాంపు లో చేరిపోడానికి తహతహలాడుతున్నారట. అయితే ఈసారి వచ్చిన అందరినీ కాక ఏరికోరి కొందర్ని సెలెక్ట్ చేసుకోవాలని కూడా దినకరన్ ఆలోచిస్తున్నారట. ఈ ఆలోచన కి భిన్నంగా ఒకప్పుడు శశికళ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప దినకరన్ ని కలవడం తమిళనాట ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఈ శశికళ పుష్ప ఎవరో చెప్పాలంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
తమిళనాడు నుంచి అన్నాడీఎంకే తరపున ఈ శశికళ పుష్పని అప్పట్లో జయలలిత రాజ్యసభకు పంపారు. అయితే ఓ రోజు సోషల్ మీడియాలో ఆమె ప్రత్యర్థి డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో అసభ్యంగా వున్న ఫోటోలు దర్శనమిచ్చాయి. దీనిపై పార్టీ వివరణ కోరినప్పుడు ఆమె ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమె ను పార్టీ నుంచి బహిష్కరించారు జయ. దీని వెనుక ఇప్పుడు జైల్లో వున్న శశికళ కుట్ర ఉందని శశికళ పుష్ప ఆరోపించారు. పెద్ద ఎత్తున చిన్నమ్మ మీద విమర్శలు కురిపించారు. మన్నార్ గుడి మాఫియా అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి శశికళ పుష్ప ఆర్కే నగర్ లో గెలిచిన దినకరన్ ఇంటికి నేరుగా వెళ్లి అభినందించారు. అడయార్ లోని తన ఇంటికి నేరుగా వచ్చిన ఆమెని చూసిన దినకరన్ కూడా ఆశ్చర్యపోయారట. ఒక్క గెలుపు తో బద్ధశత్రువు కూడా ఇంటికి వస్తారా అనుకుంటూ అన్నాడీఎంకే నుంచి ఎవరు తన వైపు వచ్చినా ఓకే అందామని అనుకుంటున్నారట. ఆ విధంగా బద్దశత్రువే దినకరన్ మనసు మార్చింది.