ఎట్టకేలకి ఒకింటి వాడయిన సత్యం బాబు

Sathyambabu marriage

విజయవాడ ఆయేషా మీరా హత్య కేసులో తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలైన సత్యంబాబు ఓ ఇంటివాడయ్యాడు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతితో అతడి వివాహం జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో మొన్ననే పెళ్లి జరిగింది. వాస్తవానికి ఆయేషా మీరా హత్యోదంతానికి ముందే సత్యంబాబుకు తన మరదలితో వివాహం జరిగింది. కానీ, వ్యక్తిగత కారణాలతో ఆమె సత్యంబాబును వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాతనే సత్యంబాబు ఆయేషా మీరా హత్య కేసులో చిక్కుకున్నాడు. తొమ్మిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో కొన్ని నెలల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూశాడు. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్ చుట్టూ సత్యంబాబు తన కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. సత్యంబాబును నర్సుగా పనిచేసే అతడి తల్లి మరియమ్మే పోషించింది. ఈలోగా అతడి తల్లి మరియమ్మ మతిస్థిమితం కోల్పోయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటీవల ఔట్ సోర్సింగ్‌లో ఓ ఉద్యోగం దొరకడంతో ఊరట కలిగింది. ఉద్యోగంలో చేరాక సత్యంబాబు తన చెల్లెలికి పెళ్లి జరిపించాడు. కానీ, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో సత్యంబాబుకు లైంగిక శక్తి లేదని.. ఆయేషాను అతడు అత్యాచారం చేసి చంపాడనే ఆరోపణల్లో నిజంలేదని అతడి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సత్యంబాబుకు లైంగిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడు నపుంసకుడు కాదని తేల్చడంతో అతడు బంధువులు కుదుర్చిన సంబంధం చేసుకున్నాడు. ఆయేషా మీరా కేసులో సత్యంబాబు నిర్దోషిగా బయటపడిన తర్వాత కథ సుఖాంతం అనుకున్న సమయంలో ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసును మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు.