ముస్లిం సంప్రదాయ దేశాల్లో మహిళల పట్ల నిర్లక్ష్య వైఖరి క్రమంగా మారుతోంది. కేవలం వారిని పిల్లల్ని కనే వస్తువులుగానే చూస్తూ వచ్చిన ఇస్లాం దేశాలు.. ఇప్పుడిప్పుడే వారి ఉనికిని గుర్తించేందుకు మెల్లగా అడుగులు వేస్తున్నాయి. ఈ దేశాల్లో అన్నింటి కంటే సౌదీ ముందుందనే చెప్పుకోవాలి. గడచిన ఐదేళ్లలో పనిచేసే మహిళల శాతం 33 శాతానికి చేరుకుంది. 2018 వరకు మహిళలకు క్యాబ్‌లను నడపడానికి అనుమతిలేదు. ఆ తర్వాత సౌదీ ప్రభుత్వం మహిళలను క్యాబ్‌లు నడపటానికి ఆమోదం తెలిపింది.
ఏకంగా పది వేల మంది మహిళలకు సౌదీ ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసింది. ఇది మహిళల పట్ల ముస్లిం పాలకుల వైఖరి మారుతుందనడానికి నిదర్శనం. తాజాగా, మరో అంశం సౌదీలో పెరుగుతున్న మహిళల ప్రాతినిథ్యానికి ఉదాహరణగా నిలిచింది. ఇటీవల లోకో పైలట్ ఉద్యోగాలకు సౌదీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా.. భారీ సంఖ్యలో మహిళల నుంచి స్పందన లభించింది.
మొత్తం 30 మహిళా లోకోపైలట్ ఉద్యోగాలకు 28 వేల మందికిపైగా దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో విద్యార్హతలు, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు వంటి ప్రమాణాల ద్వారా అభ్యర్థుల వడపోత చేపట్టినట్టు స్పెయిన్‌కు చెందిన రైల్వే ఆపరేటర్ రెన్ఫే పేర్కొంది. ఈ వడపోతలో సగం మంది ఎగిరిపోయారని, మార్చి మధ్యనాటికి మిగతా ప్రక్రియ పూర్తిచేసి ఎంపిక చేస్తారని తెలిపింది. ఎంపికైన 30 మందికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం మక్కా నుంచి మదీనా మధ్య నడిచే బుల్లెట్ రైల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.
స్థానిక వ్యాపారంలో మహిళలకు అవకాశాలను కల్పించడానికి ఆసక్తిగా ఉన్నట్లు రెన్ఫే తెలిపింది. సౌదీలో లోకో పైలట్లుగా ప్రస్తుతం 80 మంది పురుషులను నియమించిన ఆ సంస్థ.. మరో 50 మందికి శిక్షణ ఇస్తోంది. సౌదీ మహిళలను ఇటీవల వరకు ఉపాధ్యాయులు, హెల్త్ వర్కర్లు వంటి ఉద్యోగాలకే పరిమితం చేశారు. మిగతా పోస్టులకు కఠినమైన లింగ విభజన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల భాగస్వామ్యం కీలకమని గుర్తించిన సౌదీ యువరాజు.. ఒకప్పుడు పురుషులు, వలస కార్మికులకు మాత్రమే పరిమితమైన ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో గత ఐదేళ్లలో మహిళల భాగస్వామ్యం దాదాపు 33 శాతానికి పెరిగింది. గతేడాది మూడో త్రైమాసికంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే సగానికిపైగా ఉంది. అక్కడ నిరుద్యోగుల్లో మహిళలే ఎక్కువ ఉన్నట్టు ఇటీవల వెల్లడించిన గణాంకాల్లో తేలింది.