మరో వివాదంలో చింతమనేని !

నిత్యం వివాదాల్లో ఇరుక్కుని తన పేరును పార్టీ పేరును వార్తల్లో ఉండేలా చూసుకునే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసులో ఇరుక్కున్నారు. ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాక అతని మీద భౌతుక దాడి జరిగిందని ఆయన మీద ఆరోపణ. ఈ మేరకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఎస్సీ సంఘాలు ఆందోళనలబాట పట్టి సాగించిన నిరసనల తర్వాత సర్కారు దిగివచ్చింది. ఆయన మీద కేసు నమోదు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే ఏలూరులోని ఐఎంఎల్‌ డిపోలో గొర్రెల శ్యాంబాబు అనే కార్మికుడు ఈ నెల 7న రాయల్‌గ్రీన్‌ 180 ఎంఎల్‌ బ్రాందీని అపహరించడంతో యూనియన్‌ నిబంధనల ప్రకారం అతన్ని పని నుంచి తొలగించారు. శ్యాంబాబు బావమరిది చుక్కా ఈశ్వరరావు కూడా అక్కడే కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

టీడీపీ నాయకుడు నేతల రవి ద్వారా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు విషయం ఈశ్వరరావు చేరవేయడంతో ఈ నెల 10న యూనియన్‌ నాయకుడు రాచీటి జాన్‌, మిగిలిన వారిని రమ్మని ఎమ్మెల్యే కబురు పంపారు. అదేరోజు రాత్రి తన ఇంటికి వచ్చిన వారితో శ్యాంబాబును వెంటనే పనిలో పెట్టుకోవాలని చింతమనేని ఆదేశించారు. యూనియన్‌ నిబంధనల ప్రకారం కుదరదని జాన్‌ చెప్పడంతో అతనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేసి కొట్టారని, ఆయనతో బాటు గన్‌మెన్‌లు ముగ్గురు, నేతల రవి, ఈశ్వరరావు కూడా తన పై దాడి చేశారని జాన్ ఆరోపణ. ఈ మేరకు జాన్ ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో పలు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఆందోళనలు, రిలే దీక్షలు చేపట్టాయి. దీంతో దిగొచ్చిన పోలీస్ శాఖ ఆయన మీదా, ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్ మెన్లు, అనుచరుల మీదా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు.