ఇంటి దొడ్లో ప్రతిభా పరీక్ష …ఇదా చైతన్యం ?

Schools Done Fraud in Prathibha Talent Test -

“ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్”…జాతీయ స్థాయిలో సెకండరీ స్కూల్ స్థాయి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు పెడుతున్న పరీక్ష. ప్రతిభకు ఏ అడ్డంకి రాకూడదని భావించి తల్లిదండ్రుల ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఈ పరీక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్ష రాయాలంటే మూడే మూడు అర్హతలు ఉండాలి.
1 . భారత పౌరుడు అయ్యుండాలి.
2 . దేశంలోని గుర్తింపు పొందిన ఏదో ఓ స్కూల్ లో 10 th క్లాస్ చదువుతుండాలి.
3 . 9 వ తరగతిలో 75 శాతానికి మించి మార్కులు పొంది ఉండాలి.

దేశం మొత్తం మీద 1000 మందిని మూడు దశల్లో జరిగే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆ సంఖ్య 2000 ఉంటుందని అంచనా. ఇందులో ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉపకార వేతనం అందుతుంది.

ఇంతటి ప్రెస్టీజియస్ టెస్ట్ లో ఎంపిక కావడం అంటే చిన్న విషయం కాదు . బుర్రలో ఏ కాస్త గుజ్జు వున్నా ఇలాంటి పరీక్షల స్థాయి ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది. మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష తొలిదశ నిర్వహణ రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. స్టేజి 1 పరీక్షలకు పిల్లల్ని సన్నద్ధం చేయడం తల్లిదండ్రులు , పాఠశాలకు ఓ పరీక్ష. అయితే ఈ పరీక్షలని సెల్ఫ్ సెంటర్స్ లో నిర్వహించుకునే అవకాశం ఉండడంతో ఓ కార్పొరేట్ కాలేజీ కొత్త సూత్రాన్ని ఒంటబట్టించుకుంది. పిల్లల్ని కష్టపడి పరీక్షకు సిద్ధం చేయడం మీద కన్నా సొంత సెంటర్ లో నిర్వహించే పద్ధతి మీద దృష్టి పెట్టింది. కాపీ, పేస్ట్ బెస్ట్ , ప్రతిభ వేస్ట్ అని నమ్మినట్టుంది. అందుకే పరీక్ష నిర్వహణలో ఫ్రీడమ్ మంత్రాన్ని పఠించింది. ఇంకేముంది…

ఇబ్బడిముబ్బడిగా మార్కులు వచ్చాయి. ఆ కాలేజీ సెల్ఫ్ సెంటర్స్ లో రాసిన విద్యార్థులే పెద్ద సంఖ్యలో స్టేజ్ 1 పరీక్షలో అగ్రగామిగా నిలిచారు. ఇక ప్రచారం ఆకాశాన్ని అంటింది. ఆ ప్రచారం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 142 మంది రెండో దశకు ఎంపిక అయ్యారు. అందులో ఆ ప్రచార చైతన్యం మెండుగా వున్న స్కూల్ నుంచే 110 మంది వున్నారు. ఇక తెలంగాణాలో 118 మంది రెండో దశకు ఎంపిక అయితే వారిలో 40 మంది ఆ ఇంటి పరీక్ష రాసిన వాళ్ళే.

ఈ రిజల్ట్స్ ని ఘనంగా చెప్పుకుంటున్న సదరు సంస్థ నిజానికి ప్రతిభకు పాతర వేస్తోంది. సెల్ఫ్ సెంటర్స్ లో ఫ్రీడమ్ మంత్రం జపించి తొలిదశ పరీక్ష లో నెగ్గిన వాళ్ళు ఎటూ రెండో దశలో చేతులు ఎత్తేస్తారు. ఇక తొలిదశలో అక్రమ విధానాలు నిజమైన ప్రతిభకు భారీ అడ్డంకి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఏ పరీక్ష అన్నా తెలుగు తేజాలు మెరిసిపోయే ఈ దశలో NTSE విషయానికి వచ్చేసరికి వెనకపడడానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది. దాదాపు అన్ని పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించే ఈ రోజుల్లో పరీక్ష నిర్వహణలో లోపాలు , వాటిని వాడుకొని పోటీలో ఎలాగైనా నెగ్గాలి అనుకునే కొందరి స్వార్ధంతో నిజమైన ప్రతిభకు మరుగున పడుతోంది.

ఇలా ఏది పడితే అది చెబితే నిజం అయిపోతుందా అనుకునే వాళ్ళు కూడా వుంటారు. అలాంటి వాళ్ళు కాస్త స్టేజ్ 1 , స్టేజ్ 2 పరీక్షల్లో సదరు సంస్థ సాధించిన ఫలితాలు విశ్లేషిస్తే చాలు. ఆ గూడుపుఠాణి ఏంటో తేలిగ్గా తెలిసిపోతుంది. ఇంటి దొడ్లో పరీక్షతో ప్రతిభని కట్టేయాలనుకున్న గుట్టు రట్టవుతుంది. కిందటి ఏడాది కూడా ఇలాగే జరిగింది. ప్రచార హోరుతో ప్రతిభకు పాతర వేశారు. దురదృష్టం ఏమిటంటే ఏ ప్రతిభకు పట్టం కట్టడానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారో దాని నిర్వహణలో లోపమే అక్రమార్కుల పాలిట వరంగా మారడం.