ప్రమాదం వల్లో.. ఇంకో కారణం చేతో వెన్నెముకకు దెబ్బతగిలిందను కోండి… గాయం తీవ్రతను బట్టి.. జీవితాంతం కదల్లేని పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. వైద్యం అభివృద్ధి చెందిందని మనం ఎంత అనుకున్నా ఇలాంటి సమస్యలకు మాత్రం ఇప్పటికీ పరిష్కారం లేదు. కానీ ప్రయత్నాలైతే బోలెడు. ఈ క్రమంలోనే నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవ్తేతలు వెన్నెముక గాయాల కారణంగా చచ్చుబడిపోయిన వారిని మళ్లీ నడిపించగల అద్భుత ఔషధం ఒకదాన్ని సిద్ధం చేశారు.
ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించిన తరువాత పక్షవాతంతో ఉన్న ఎలుకలు నాలుగు వారాల్లో మళ్లీ చురుకుగా కదలగలిగాయి. వెన్నెముకలోని న్యూరాన్లు మన మెదడు, కండరాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడుతూంటా యన్నది తెలిసిందే. గాయాలు లేదా వ్యాధుల కారణంగా ఈ న్యూరాన్లు దెబ్బతింటే మన కదలికలు దెబ్బతింటాయి. కేంద్ర నాడీ వ్యవస్థకు తనను తాను మరమ్మతు చేసుకునే శక్తి లేకపోవడం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది.
అయితే తాము సిద్ధం చేసిన ఔషధం ఐదు రకాలుగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జైదా ఇవరేజ్ తెలిపారు. మార్పులు చేసిన రెండు పెప్టైడ్లతో ఈ ఔషధం తయారైందని, ఒక పెప్టైడ్ ఆక్సాన్ల పునరుద్ధరణకు సంకేతాలు ఇస్తే రెండోది రక్తనాళాలు, ఆక్సాన్ల చుట్టూ ఉండే మెయిలీన్ పొర వృద్ధికి సాయపడతాయని వివరించారు. ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత నాలుగు వారాలకు ఎలుకలు మళ్లీ నడవగలిగాయన్నారు.
మిగిలిన చికిత్సా పద్ధతుల మాదిరిగా ఇది ఖరీదైన వ్యవహారం కాకపోవడం ఇంకో విశేషం. మానవ కణాలపై కూడా తాము ఈ మందును ప్రయోగించి మంచి ఫలితాలే పొందామని చెప్పారు ప్రమాదాలు జరిగిన వెంటనే వెన్నెముక గాయాలైన వారు పక్షవాతానికి గురి కాకుండా నివారించేందుకు ఈ మందును ఉపయోగించే అవకాశం ఉంది.