Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హార్వే వైన్ స్టైన్… ఇప్పుడు హాలీవుడ్ కు చెందిన ఏ పత్రిక చూసినా, వెబ్ సైట్ చూసినా… కనిపిస్తోంది ఈ పేరే. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత అయిన వైన్ స్టైన్ గురించి ఇంతలా పత్రికల్లోనూ, వెబ్ సైట్లలోనూ కథనాలు రావడానికి కారణం ఆయనేదో కొత్తగా ఆస్కార్ అవార్డు గెలుచుకోలేదు… అలాగే రికార్డులు తిరగరాసే సరికొత్త సినిమానూ నిర్మించలేదు. మరి ఆయన గురించి ఇంతగా చర్చ జరగడానికి కారణం హార్వే చేసిన చెడు పనులే. తన నిర్మాణ సంస్థలో పనిచేసే నటీమణులతో హార్వే అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారిని లోబరుచుకునేవాడని, హాలీవుడ్ న్యూస్ వెబ్ సైట్ వెరైటీ. కామ్ ఓ కథనం రాసింది. ఈ కథనం హాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ సిమోన్ షెఫీల్డ్ కూడా తనకు ఎదురయిన అనుభవాన్ని వెల్లడించింది. ఐశ్వర్యారాయ్ హార్వే బారిన పడకుండా తానే రక్షించానని తెలిపింది. ఓసారి అమెరికాలో నిర్వహించిన ఆంఫార్ గాలాకు ఐశ్వర్య తన భర్త అభిషేక్ తో కలిసి వెళ్లింది. అక్కడ వారిద్దరూ హార్వేతో కలిసి ఫొటో కూడా దిగారు. ఐష్ ను చూసిన హార్వే ఆమెతో వ్యక్తిగతంగా సమావేశం ఏర్పాటు చేయమని తనను వేడుకున్నాడని సిమోన్ తెలిపింది. అప్పుడు ఐశ్వర్యారాయ్ వృత్తికి సంబంధించిన విషయాలన్నీ తానే చూసుకునేదాన్నని, ఆ సమయంలో ఐశ్వర్యను ఒంటరిగా కలవడానికి హార్వే తీవ్రంగా ప్రయత్నించేవాడని సిమోన్ చెప్పింది.
ఐశ్వర్య, హార్వే, తాను కూర్చుని ఉన్నప్పుడు తనను అక్కడినుంచి వెళ్లిపొమ్మనేవాడని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదని ఆమె వెల్లడించింది. ఐశ్వర్య, తాను హార్వే ఆఫీసు నుంచి బయటకు వస్తోంటే తనను పక్కకు తీసుకెళ్లి అతను బెదిరించాడని, కానీ తాను భయపడలేదని, హార్వేను, ఐశ్వర్యారాయ్ ఛాయలకు కూడా రానివ్వలేదని సిమోన్ వివరించింది. హార్వేకు వ్యతిరేకంగా ఒక్కో హీరోయిన్ తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడాన్ని సిమోన్ మెచ్చుకుంది. హార్వే వేధింపులకు గురయిన వారంతా బయటికొచ్చి నిజాలను వెల్లడించాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటీమణులు హార్వే తమపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.