ప్రముఖ నటి రేఖ ఇంటికి కరోనా సెగ తాకింది. ఆమె సెక్యూరిటీ గార్డుకు శనివారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముంబైలోని ఆమె భవనాన్ని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. బిల్డింగ్ బయట కంటైన్‌మెంట్ జోన్ అని నోటీసును అతికించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. రేఖ నివాసముండే బంగ్లాకు “సీ స్ప్రింగ్స్” అని పేరు.
ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. తాజాగా అందులో ఒకరు కరోనా బారిన పడగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, కరణ్ జోహార్, బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే సిబ్బంది సైతం ఈ మధ్యే వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.
ఇదిలా వుండగా శనివారం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, అతని కొడుకు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించగా పలువురు సెలబ్రిటీలు వారు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ముంబైలో శనివారం కొత్తగా 1284 కేసులు వెలుగు చూడగా ఒక్క ముంబైలోనే మొత్తం కేసుల సంఖ్య 91,745కు చేరుకుంది.