Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1970వ దశకంలో వెస్టెండీస్ క్రికెట్ జట్టు భీకరమైన ఫామ్ లో ఉండేది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారు విండీస్ ఆటగాళ్లు. ఆ సమయంలో వెస్టెండీస్ తో మ్యాచ్ ఆడాలంటే… ఉపఖండం బ్యాట్స్ మెన్ కు రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు… ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్వయంగా అంగీకరించాడు కూడా. 90లు వచ్చే నాటికి ఆ పరిస్థితి మారిపోయింది. వెస్టెండీస్ అన్ని విభాగాల్లో బలహీన పడగా… ఆ జట్టుస్థానాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించింది. 1999లో వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా కొన్నేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ను శాసించింది. వరసగా మూడు ప్రపంచ కప్ లను గెలుచుకుంది. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే గెలుపు ఆస్ట్రేలియాదే అన్న ఆటతీరు కనబర్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలన్నంత కసిగా ఉండేవాళ్లు అప్పటి ఆసిస్ ఆటగాళ్లు.
దిగ్గజ క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాత ఆసిస్ ఆ ప్రాభవం కోల్పోయింది. ఆ జట్టులోనూ ఉత్తానపతనాలు చోటుచేసుకున్నాయి. టెస్టుల్లోనూ, వన్డేలోనూ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. తర్వాత నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ అనేక ఒడిదుడుకులకు లోనవుతోంది. 2015లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పటికీ గతంలో ఉన్న ప్రాభవాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయింది. ఇక ఇప్పటి ఆసిస్ జట్టు పరిస్థితిని చూస్తే… ఆస్ట్రేలియా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను ఏలిందన్న సంగతి నమ్మబుద్ధి కాదు. భారత్ పర్యటనలో ఆ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తోంది. అదే సమయంలో భారత్ మాత్రం అమోఘమైన ఆటతీరు కనబరుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ పతనం దిశగా వెళ్తున్న సమయంలోనే భారత్ ఉన్నతస్థాయికి ఎదిగింది.
సరిగ్గా చెప్పాలంటే… ఒకప్పుడు వెస్టెండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ స్థితిలో ఉన్నాయో… భారత్ ఇప్పుడు ఆ వైభవోపేత స్థితిలో ఉంది. టెస్ట్ , వన్డే ఫార్మాట్ లలో నెంబర్ వన్ గా ఉన్న భారత్… తాజా పర్యటనల్లో స్థిరమైన ఆటతీరును కొనసాగిస్తోంది. అందుకే భారత్ తో మ్యాచ్ అంటే ఇప్పుడు ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఆస్ట్రేలియా తాత్కాలిక ప్రధాన కోచ్ డేవిడ్ సకర్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు.
భారత్ తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు భయపడుతున్నారని డేవిడ్ సకర్ అన్నాడు. భారత్ తో వన్డే సిరీస్ ను 1-4తేడాతో కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలామంది భయంతో ఆడుతున్నారని, వాళ్లు వీలైనంత స్వేచ్ఛగా ఆడాలన్నది తమ కోరికని, కానీ ఓడిపోతుంటే భయం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, ఈ సమస్యను అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశాడు.
మరోవైపు స్లెడ్జింగ్ కు మారుపేరైన ఆస్ట్రేలియా తాజా వన్డే సిరీస్ లో ఎక్కడా స్లెడ్జింగ్ కు పాల్పడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గల కారణాన్ని భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తెలియజేశాడు. వచ్చే ఏడాది విదేశీ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ వేలం జరగనుందని, ఇలాంటి సమయంలో భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్ కు పాల్పడితే ఫ్రాంచైజీలు వారిని తీసుకునేందుకు ఆలోచిస్తాయని… అందుకే వారు ఈ సారి స్లెడ్జింగ్ కు దూరంగా ఉన్నారని సెహ్వాగ్ విశ్లేషించాడు.