జనసేన కి అధినేత మాంచి మాస్ ఫాలోయింగ్ వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆ చరిష్మా రాజకీయ యవనిక మీద మాత్రం కింద పైన పడుతోంది. ఇందుకు ప్రధాన అవరోధంగా ఇప్పటిదాకా కనిపిస్తోంది మీడియా లో ఆ పార్టీ గొంతుక సరిగ్గా వినిపించే నాయకుడు దొరక్కపోవడమే. మిగిలిన విషయాలు ఎలా వున్నా టీవీ చర్చల్లో , పార్టీ విధానాలు, అభిప్రాయాలు తెలియజేసే సందర్భాల్లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటు తీర్చుకోడానికి జనసేన తాజాగా తీసుకున్న నిర్ణయం ఉపయోగపడేలా అనిపిస్తోంది. ఆ నిర్ణయం ఇంకేమిటో కాదు. పార్టీ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సమాచార హక్కు చట్టం కమిషనర్ గా పని చేసిన విజయబాబుని నియమించడమే.
చేసిన పదవి మాత్రమే కాకుండా విజయబాబు ఓ జర్నలిస్ట్ గా కూడా సుదీర్ఘంగా పని చేశారు. ఉన్నత స్థాయిలో వివిధ హోదాల్లో కూడా జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రభ నిర్వహించిన పల్లకి పత్రిక ద్వారా 1985 లో జర్నలిజం కెరీర్ మొదలెట్టిన ఆయన అదే పత్రిక కి చీఫ్ గా కూడా పని చేశారు. ఓ జర్నలిస్ట్ గా వివిధ దేశాలకు వెళ్లి వివిధ టాపిక్స్ మీద పేపర్స్ కూడా ప్రెసెంట్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా టీవీ చర్చల్లో విశ్లేషకుడిగా ఆయన సూటిగా, స్పష్టంగా మాట్లాడగలరు అన్న అభిప్రాయం తెప్పించుకున్నారు. టీవీ డిబేట్ కి వచ్చే కొందరిలా ఆయన అరుపులు ,కేకలకు దూరం. కేవలం సబ్జెక్టు మీదే మాట్లాడతారు. అలాంటి విజయబాబుని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంచుకోవడం బాగానే వుంది.
అయితే అవును ఇక్కడ అయితే అనడానికి ఓ కారణం వుంది. ఈమధ్య దాకా జరిగిన టీవీ చర్చల్లో ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాలను విజయబాబు పెద్దగా సమర్ధించలేదు. పైగా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. పార్ట్ టైం రాజకీయాలు తగవని గట్టిగా కుండ బద్దలు కొట్టారు. ఆయన ఇప్పుడు జనసేన తరపున అధికార ప్రతినిధిగా నియమితులు కావడమే విశేషం. దీని వెనుక ఏమి కారణాలు ఉన్నాయో తెలియదు. అయితే కొందరు విమర్శిస్తున్నట్టు ఇది కేవలం సామాజిక వర్గ ప్రభావం అనుకోడానికి అంత కన్నా వీల్లేదు. విజయబాబు లాంటి సామాజిక స్పృహ వున్న వ్యక్తిని అలాంటి గాడిన కట్టివేయడం సమంజసం కాదు. అయితే విజయబాబు ఇప్పుడు జనసేన జెండా కప్పుకుని అంతే స్వేచ్ఛగా, అంతే సమర్ధంగా మాట్లాడే పరిస్థితి ఉందా ? ఆ పరిస్థితి జనసేన కల్పిస్తుందా ? . ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికితే రాజకీయంగా బుడిబుడి అడుగులు వేస్తున్న జనసేనకు ఇక ఓ సమస్య అధిగమించినట్టే.