Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ …ఈ మూడు అక్షరాల పేరు ఎన్ని సార్లు విన్నా ఉత్సాహం పొంగుతూనే ఉంటుంది. ఆయన ప్రస్తావన వచ్చినపుడల్లా తెలుగు వాడి ఛాతీ ఉప్పొంగుతూనే ఉంటుంది. సినిమాల్లో దేవుడుగా కొలుస్తున్న జనాన్ని నిజ జీవితంలో ఆదుకోడానికి, చేదోడువాదోడుగా ఉండటానికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ పతాకాన్ని తెలుగు దేశంలో ప్రతిష్టించిన ఆ మహా నాయకుడు, వెండితెర ఇలవేలుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 35 ఏళ్ళు గడిచింది. 1983 ,జనవరి 9 న ఆయన మొదటిసారి సీఎం గా పదవీప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఆయన తెలుగు ప్రజల్ని ఉద్దేశించి సీఎం హోదాలో ప్రసంగించారు . నేటికీ ఆ మాటలు చాలా మంది చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి. రాజకీయ ప్రసంగాల ఒరవడిని మార్చేసిన ఆ ప్రసంగం పాఠం ఇప్పుడు మీకోసం …
మహొత్తుంగ జలధి తరంగాల్లో ఉత్సాహంతో ఉప్పొంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తూంటే నాలో ఆవేశం తొణికిసలాడుతున్నది.
పుట్టి ఏడాది కూడా నిండని ‘తెలుగుదేశం’ఇంత త్వరలోనే అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం.
ఒక్క తెలుగువాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా, బడబాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలను, అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు.
అందుకు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నాను. నాకు నా జాతి చైతన్యం మీద, పరాక్రమం మీద,అచంచలమైన నమ్మకముంది.
నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళ హృదయాల్లోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు.
శౌర్యం విజృంభిస్తే ఎంత శక్తివంతమైన ఆక్రమ శక్తి ఐనా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు.
అందుచేతనే మీ ముందు వినమ్రుడనై చెబుతున్నాను ఆది మీ విజయం.. ఆరుకోట్ల తెలుగు వీర ప్రజానీకం సాధించిన అద్బుతమైన, అపూర్వమైన విషయమని మనవి చేస్తున్నాను.
ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత? మహా సముద్రంలో నీటి బిందువంత మాత్రమే.
కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరిది గెలపని ప్రకటిస్తున్నాను.
ఈ ఎన్నికల్లో జనబలం అన్నింటినీ జయించింది. తెలుగు వారి అత్మాభిమానం అంగడి సరుకు కాదని తెలుగువాడు మూడోకన్ను తెరిస్తే అధర్మం,అన్యాయం, కాలి బూడిదై పోతాయని మన రాష్ట్ర్రంలో విజృభించిన జన చైతన్య ప్రభంజనం చాటి చెప్పింది.
దాని ముందు కొండలు కూడా బెండులాగా ఎగిరిపోతాయాని రుజువైంది. మీరిచ్చిన ప్రోత్సహ తరంగాల మీదనే నా ప్రచార జైత్రయాత్ర అవిఘ్నంగా అప్రతిహతంగా సాగిపోయింది.
నా పట్ల ప్రజలు ప్రదర్శించిన వాత్సల్యానికి, చేకూర్చిన ఈ అద్బుత విజయానికి ఎలా,ఏమని కృతజ్ఞత చెప్పాలో నాకు తోచడం లేదు.
నిజానికి మీ ప్రేమానురాగాల గిరించి వర్ణించడానికి మాటలు చాలవు. మీ ఋణాన్ని తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు.
మళ్ళీ జన్మంటూ వుంటే తెలుగు తల్లికి తనయుడుగా పుట్టి మీ సేవలో నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఉంది.
నాలోని ప్రతి అణువును ప్రతి రక్తపు బొట్టునూ మీ కోసం ధారబోయాలని ఉంది.
ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి, విజయోస్తు అని అశీర్వదించి, రక్తతిలకం తీర్ఛి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి మా అభినందనలు అర్పిస్తున్నాను.
ఇక తెలుగువాడినీ, వేడిని ప్రతిబింబించే ఉడుకు నెత్తురు ఉప్పొంగే నవయువతరం గురించి ఏం చెప్పాలి? వాళ్ళు వీరభద్రుల్లా విక్రమించారు. తెలుగుదేశం విజయసాధనలో అగ్రగాములయ్యారు.
అలాంటి నా తమ్ముళ్ళకు నేను చెప్పేదోకటే. ఇది మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న వెలుగుబాట. పోతే చిన్నారి చిట్టి బాలురున్నారు.
వాళ్ళకు ఓట్లు లేవు. అయినా శ్రీరాముని సేతుబంధనంలో ఉడత సహాయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్దుణ్ణయ్యాను.
రేపటి వేకువ విరిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తున్నాను.
తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర్ర అభివృద్దికి అనేక అంశాల కార్యక్రమం ఉంది. రాష్ట్ర్ర్ర ప్రజనీకం నా మీద, తెలుగుదేశం మీద ఎన్నో అశలు పెట్టుకున్నారని నాకు తెలుసు.
ప్రణాళికలోని వివిధ అంశాలను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుపుతాము.
ఈ విషయంలో ఏరుదాటి తెప్ప తగలేసే తప్పుడు పని చేయబోనని హామి ఇస్తున్నాను.
ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్దికి మా శయశక్తులా కృషి చేస్తాం.
త్రాగేందుకు మంచి నీళ్ళకు సైతం నోచుకోని ఉళ్ళున్నాయి. తలదాచుకోను తావులేని నిర్భాగ్య జీవులున్నారు.
రెక్కాడినా డొక్కాడని శ్రమజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.
వాళ్ళను వేంటనే అదుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించాలి గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు గన్నారు.
అదే రామరాజ్యం అన్నారు. తెలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పాటుపడుతుంది.
బడిపిల్లలకు ఉచిత మధ్యాన్న భోజన పథకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు ఇప్పించడం సక్రమంగా అమలు జరుపుతాము.
వ్యవసాయ, పరిశ్రమలు సమాతుకంలో సత్వరాభివృద్దికి కృషి చేస్తాము.
రాష్ట్ర్రంలో వెనుకబడిన, కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతాల అభివృద్దికి శ్రద్ద తీసుకుంటాము.
ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకుచిత తత్వాలకు ఆసాధ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి దీక్ష వహిస్తాము.
ఈ కార్యక్రమం అనుకున్న విధంగా అమలులోనికి రావాలంటే పాలన వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగాలి.
ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. ఉద్యోగులు ప్రజా పీడకులు కాకుండా, వాళ్ళ ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి.
కానీ దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్థ అలా లేదు. అధికార దర్పం, పనిలో జాప్యం, లంచగొండితనం వగైరా నానారకాలైన జాడ్యాలకు కేంద్రమైంది.
ముప్పై ఐదు ఏళ్ళుగా పొరలు పొరలుగా పేరుకోని ఘనీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయవలసి వుంది. అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదనీ నాకూ, మీకు కూడా తెలుసు. తెలుగునాట ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నింటితో కడిగినా ప్రక్షాళనం కానంతటి కల్మషం పేరుకుని వుంది.
ఇది తెలుగుదేశంకు సక్రమించిన వారసత్వం. కాబట్టి ఒక్క రోజులో ఈ పాలన వ్యవస్థను మార్ఛడం అయ్యే పనికాదు.
అయితే అత్మవిశ్వాసం నాకు ఉంది. మన అధికారుల అండతోనూ ఈ కృషిలో జయప్రదం కాగలమన్న కక్ష, కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి.
తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ప్రోత్సాహంగా ఉంటుంది.
అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులకు కూడా ఈ సంధర్బంలో ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను.
గతంలో ఏ అనివార్య రాజకీయ కారణాలవల్లనో, ఇతర కక్కుర్తివల్లనో అక్రమాలకూ,అధికార దుర్వనియోగానికి పాల్పడి వుండవచ్చు.
వాళ్ళు ఇప్పుడైన పశ్చాత్తాపం చెంది తమ పద్దతులు మార్చుకుంటే మంచిది. లేకపోతే అలాంటి విషయంలో నిర్థాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం.
ఈ విషయంలో మమ్ము ఏ శక్తి అడ్డలేదు. కానీ వాళ్ళను ఏ శక్తి రక్షించలేదని కూడా తెలియ జేస్తున్నాను.
అన్నిశాఖల ప్రభుత్వోద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఉద్యోగుల సాధక బాధాకాలను మా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది.
ముఖ్యంగా చాలీ చాలనీ జీతాలతో బాధపడే వాళ్లకు తగిన సహాయం చేస్తుంది.
అదే సమయంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నిజాయితిగా, సమర్థంగా పనిచేయాలని కోరుతుంది.
అనేక రంగాల్లో అనుభవజ్ఞులూ, మేధావులూ మన రాష్ట్ర్ర్రంలో వున్నారు. వాళ్ళందరి సహకారాన్ని మేము సవినయంగా అర్థిస్తున్నాను.
రాను రాను మన రాష్ట్ర్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని,ప్రజల మాన , ధన ప్రాణాలకు, స్త్ర్రీల శీలానికి రక్షణ లేకుండా పోయింది.
అందరికి తెలుసు. మన సమాజంలో అరాచక, హింసా, దౌర్జన్యశక్తులు వికట తాండవం చేస్తున్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది.
బందిపోట్లను, గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్థాక్షిణ్యంగా అణిచి వేసే విషయంలో అధికారులు తీసుకునే చర్యలను గౌరవించి అభినంధిస్తుంది.
పోలీస్ శాఖలో ఉత్సాహవంతులు, సమర్థులు, సాహసికులూ, నీతిపరులైన వాళ్ళున్నారు.
అలాంటి వాళ్ళను మా ప్రభుత్వం అభిమానిస్తుంది, ఆదరిస్తుంది.
ప్రజలను రక్షించవలసిన ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు, పోలీసుల జీతాలను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తాము.
పోలీసులను ప్రజలు నిజంగా తమ రక్షకులు అనుకునేటట్లు ఆ శాఖను తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం.
అందుకు సహకరించవలసిందిగా ఆ శాఖ ఉద్యోగులందరిని కోరుతున్నాను.
మన తెలుగునాడు వ్యవసాయ ప్రధానమైంది. అయినా రైతాంగం గిట్టుబాటు ధరలేక తగినంత పెట్టుబడి లేకా నానా ఇబ్బందులూ పడుతోంది. తెలుగుదేశంపార్టీ వ్యవసాయాభివృద్దికి, దానితోపాటు సత్వర పారిశ్రామికాభివృద్దికి పాటు పడుతుంది.
మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవలసిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను.
రాష్ట్ర్ర్రాభివృద్దికి అవసరమైన అన్ని వనరులూ మనకున్నాయి.
వాటిని నిర్ణీత పథకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి ఉంది. ఇలాంటివే ఇంకేన్నో జటిల సమస్యలు మన ముందున్నాయి. వాటన్నింటిని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకోవలసి ఉంది.
ఈ సందర్భంలో తెలుగుదేశంను అనూహ్యమైన మెజారిటీతో గెలిపించిన తెలుగు ప్రజలందరికి నాదో విన్నపం.
ఈ విజయానికి మీరే కర్తలు. అలాగే అభివృద్దికీ మీరే కర్తలు అని సవినయంగా మనవి చేసుకుంటూ శలవు దీసుకుంటున్నాను.
జై తెలుగుదేశం!
జై జై తెలుగుదేశం!!