నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక హైకోర్టు?

temporary-high-courts-at-nagarjuna-university
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హైకోర్టు విభజన ప్రక్రియ ఊపు అందుకున్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగా దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉండడంతో కొంత కాలం తాత్కాలిక ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాత్కాలిక హై కోర్టు భవనాల కోసం వెదుకుతున్న అధికారగణం కన్ను ఇంకోసారి నాగార్జున యూనివర్సిటీ మీద పడింది. రాష్ట్ర విభజన సమయంలో తాత్కాలిక రాజధాని కూడా నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆపై తాత్కాలిక అసెంబ్లీ సమావేశాల కోసం కూడా నాగార్జున యూనివర్సిటీ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.
1 . నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అదనపు భవనాలు అందుబాటులో ఉండటం
2 . గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి పక్కనే యూనివర్సిటీ ప్రాంగణం ఉండటంతో ఎవరికైనా ఇక్కడికి చేరుకోవడం సులభం.
3 . నాగార్జున యూనివర్సిటీ సమీపంలోనే రైన్ ట్రీ పార్క్ రూపంలో భారీ వసతి సదుపాయం కలిగిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ ఉండటంతో పాటు మరికొన్ని భవన సముదాయాలు అందుబాటులోకి రావడం.

ఈ మూడు కారణాలతో ప్రతిసారి నాగార్జున యూనివర్సిటీ పేరు ముందుకు వస్తోంది. కానీ ప్రతిసారి వెనక్కిపోవడానికి కూడా అంత కంటే పెద్ద కారణమే వుంది. అది కూడా సెంటిమెంట్ తో కూడినది. ఇక్కడ అడుగుపెట్టిన సీఎం కి పదవీగండం ఉంటుందని ఎప్పటినుంచో ఓ టాక్. అందువల్లే ఏ ప్రతిష్టాత్మక సంస్థ విషయంలోనూ ప్రభుత్వాలు నాగార్జున యూనివర్సిటీని పరిశీలనకు మాత్రమే తీసుకుంటున్నాయి. అసలు విషయానికి వచ్చేసరికి ఇంకో చోటుకి వెళ్లిపోతున్నాయి. పైగా యూనివర్సిటీలో విద్యా వాతావరణం దెబ్బ తింటుందన్న సాకు చూపుతున్నాయి.

గుంటూరు లో హైకోర్టు శాఖ ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని ఉద్యమాలు జరిగాయి. అప్పట్లోనూ యూనివర్సిటీ పేరే ముందుకు వచ్చింది .ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోడానికి జిల్లా న్యాయ వాదులు సిద్ధంగా లేరు. అమరావతిలో భవనాలు పూర్తి అయ్యే దాకా అయినా నాగార్జున యూనివర్సిటీ భవనాల్లో హైకోర్టు నిర్వహణ చేపట్టాలని డిమాండ్ ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటోంది. హై కోర్టు భవనాల ఎంపిక కోసం ఏర్పాటు అయిన కమిటీ ముందు నాగార్జున యూనివర్సిటీ పేరు బలంగా వినిపించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఈసారైనా సెంటిమెంట్ ని అధిగమిస్తాయో లేక మరో సారి ప్రయత్నాలుగానే మిగిలిపోతాయో చూడాలి.