Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాంబే స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలిసారి 35వేల మార్క్ ను దాటింది. 300 పాయింట్లు ఎగబాకి చరిత్రలో తొలిసారి 35,000 మైలురాయిని చేరుకుంది. అటు నిఫ్టీ కూడా 10, 700 పైన ట్రేడ్ అయింది. దేశ అదనపు అప్పులు తగ్గాయన్న వార్త, కంపెనీ త్రైమాసిక ఫలితాలు అంచనాలు చేరుకోవడం, ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్ల జోరుతో దేశీయ మార్కెట్లపై లాభాల వాన కురిసింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి మరింత ఉత్సాహం పుంజుకుని 35వేల మార్క్ ను తాకింది. అదే లాభాల్ని ట్రేడింగ్ ముగింపు దాకా కొనసాగించింది. మొత్తం 311 పాయింట్లు లాభపడి 35,082వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 88 పాయింట్ల లాభంతో 10,788వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లోని అన్ని షేర్లు దాదాపు లాభాలు సాధించాయి. ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు రేపు జరగబోయే జీఎస్టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.