తెలంగాణ సీఎస్ గా శైలేంద్ర‌కుమార్ జోషి

Shailendra Kumar Joshi was appointed as the Chief Secretary of Telangana.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుత సీఎస్ ఎస్పీ సింగ్ ప‌ద‌వీకాలం బుధ‌వారంతో ముగియ‌నుంది. రేసులో చాలామందే ఉన్న‌ప్ప‌టికీ…సుమారు రెండేళ్ల స‌ర్వీసు ఉన్న జోషీ వైపే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొగ్గుచూపారు. ఆయ‌న నిర్ణ‌యం మేర‌కు ఎస్ కే జోషీని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ సాధార‌ణ ప‌రిపాల‌నాశాఖ ఉత్త‌ర్వులు జారీచేసింది. 1984బ్యాచ్ కు చెందిన శైలేంద్ర కుమార్ జోషీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌రేలీలో 1959 డిసెంబ‌ర్ 20న జ‌న్మించారు. రూర్కీ ఐఐటీలో ఇంజ‌నీరింగ్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్ట‌డీస్ నుంచి డాక్ట‌రేట్ పొందారు.

సివిల్స్ కు సెలెక్ట్ కాక‌ముందు రైల్వేలో ప‌నిచేసిన ఎస్.కె. జోషి సికింద్రాబాద్ లోనే శిక్ష‌ణ పొందారు. 1984లో మొద‌ట నెల్లూరు అసిస్టెంట్ కలెక్ట‌ర్ గా, త‌ర్వాత తెనాలి. వికారాబాద్ స‌బ్ క‌లెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హించారు. కృష్ణాజిల్లా సంయుక్త క‌లెక్ట‌ర్ గా, క‌లెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆయ‌న ఐటీ, ఇంధ‌న‌, రెవెన్యూ, పుర‌పాల‌క‌, వైద్య‌, ఆరోగ్య, నీటిపారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి, ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ మంత్రిత్వ శాఖ‌లోనూ ప‌నిచేసిన జోషి జ‌ర్మ‌నీ, జోహెన్స్ బ‌ర్గ్ లో జ‌రిగిన అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల్లో మ‌న దేశ ప్ర‌తినిధిగా పాల్గొన్నారు.

మేనేజ్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ బౌండ‌రీ వాట‌ర్ రిసోర్సెస్ అనే పుస్త‌కాన్ని ర‌చించారు. రాష్ట్రంలో ప‌లు ప్రాజెక్టుల ద్వారా, ముఖ్యంగా పాల‌మూరు ప్రాజెక్టుల ద్వారా పంట‌పొలాల‌కు నీరు అందించ‌డం వృత్తి ప‌రంగా త‌న‌కు అత్యంత సంతృప్తి క‌లిగించే విష‌య‌మ‌ని చెబుతుంటారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్ణీత గ‌డువులోగా పూర్తిచేయ‌డ‌మే త‌న క‌ల అంటుంటారు. హైదరాబాద్ అంటే ఎస్. కె. జోషికి ఎంతో ఇష్టం. హైద‌రాబాద్ చూడాల‌న్న త‌ప‌న‌తో పాఠ‌శాల స్థాయిలోనే ఆయ‌న తెలుగును మూడో భాష‌గా ఎంచుకున్నారు. త‌న‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డంపై జోషి ముఖ్య‌మంత్రికి కృతజ్ఞ‌త‌లు చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు పున‌రంకితమ‌వుతాన‌ని తెలిపారు. జోషి 2019 డిసెంబ‌ర్ వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగుతారు.