Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాలామంది పేర్లు కాస్త అటూఇటూగా ఉంటాయి. అలా పేర్ల కాస్త దగ్గరగా ఉన్న వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒకరి పేరు అనబోయి మరొకరి పేరు అనేస్తూ తికమకపడుతుంటాం. ప్రముఖుల విషయంలో ఈ గందరగోళం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వాళ్ల గురించి వార్తలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఒకరి పేరు రాయబోయి మరొకరి పేరు రాస్తే… కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇక మరణించిన వారి గురించి రాసేటప్పుడయితే మరిన్ని జాగ్రత్తలు వహించాలి. చనిపోయిన వ్యక్తి గురించి చెప్పే క్రమంలో బతికున్న వ్యక్తి పేరు ప్రస్తావిస్తే… చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఓ మీడియా చానల్ చేసిన తప్పుతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అలాంటి స్థితినే ఎదుర్కొంటున్నారు. అలనాటి బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూశారు. ఆయన గురించి రాసే క్రమంలో ఆ ఆంగ్ల మీడియా శశికపూర్ కు బదులు శశిథరూర్ అని పేర్కొంది. విషయం తెలియని నెటిజన్లు సోషల్ మీడియాలో శశికపూర్ కు బదులు, శశిథరూర్ కు నివాళులర్పించడం మొదలుపెట్టారు.
చాలా మంది థరూర్ కార్యాలయానికి విపరీతంగా ఫోన్లు కూడా చేశారు. దీంతో ట్విట్టర్ లో స్పందించారు శశిథరూర్. ఉదయం నుంచి నా కార్యాలయానికి ఫోన్లు వస్తున్నాయి. నేను చనిపోయానని వార్తలొస్తున్నాయి. కానీ నాకు ఎలాంటి బాధ లేదు. కనీసం ఇంతటి బాధాకర సమయంలోనైనా నవ్వు తెప్పించినందుకు సంతోషంగా ఉంది అని థరూర్ ట్వీట్ చేశారు. అనంతరం శశికపూర్ కు ఆయన ట్విట్టర్ లో ఘన నివాళులర్పించారు. తనలోని ఓ భాగం కోల్పోయినట్టుగా ఉందని, ఆయన గొప్ప నటుడు, అందగాడు, కాస్మోపాలిటిన్ అని కొనియాడారు. ఆయన పేరు, తన పేరు ఒకేలా ఉండడంతో నెటిజన్లు కన్ఫూజన్ అయ్యారని, శశికపూర్ ను చాలా మిస్సవుతున్నానని థరూర్ ట్వీట్ చేశారు . థరూర్ పై ఈ రకమైన వార్త రావడానికి మరో కారణం ఆదివారం ఆయన కేరళలో పర్యటించి, అనంతరం ఢిల్లీ వెళ్లారు. కేరళలో ఓఖి తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో థరూర్ కు దగ్గు, జలుబు వచ్చాయి. ఈ తరుణంలో థరూర్ గురించి ఆరాతీయడానికి చాలా మంది ఫోన్లు చేయడంతో ఆయన కార్యాలయ సిబ్బంది కంగారుపడ్డారు. తర్వాత ఇది ఓ చానెల్ నిర్వాకమని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.