అస్వస్థతకు గురైన శశికళ

అస్వస్థతకు గురైన శశికళ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహచర నిందితురాలు ఇళవరసి ఇంకొంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది.

శశికళ, ఇళవరసి, మరో బంధువు వీఎన్‌ సుధాకర్‌లు 2017, ఫిబ్రవరి నుంచి పరప్పన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇళవరసి కంటే కొంత ముందే శశికళ అరెస్టయి జైల్లో గడపడంతో ముందే విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు. సుధాకర్‌ ఇంకా కట్టలేదని తెలిసింది.