బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్‌ హసీనా 4వసారి ఘన విజయం..!

Sheikh Hasina's 4th time as Prime Minister of Bangladesh is a great victory..!
Sheikh Hasina's 4th time as Prime Minister of Bangladesh is a great victory..!

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ఆ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. పార్లమెంట్​లో 300 స్థానాలకు గానూ 299 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ 200 సీట్లలో గెలిచిందని ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా అవామీ లీగ్​ను విజేతగా ప్రకటిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.

ప్రధాని షేక్‌ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్‌-3 స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్​కు 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఎనిమిదోసారి ఆ స్థానం నుంచి పోటీ చేసిన హసీనా విజయం సాధించారు.