Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మామ్ చిత్రంలో నటనకు గానూ అతిలోకసుందరి శ్రీదేవికి 65వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డు లభించింది. అయితే ఆమెకు అవార్డు రాకూడదని ఓ వ్యక్తి బలంగా కోరుకున్నారట. కచ్చితంగా అవార్డుల్లో ఆమె పేరు ఉండకూడదు అనుకున్నారట. ఉత్తమనటిగా శ్రీదేవి పేరు ఉండకూడదని చాలా పోరాడాడట కూడా. ఆయనెవరో కాదు… 65వ జాతీయ అవార్డుల జ్యూరీకి నేతృత్వం వహించిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్. ఉత్తమనటిగా శ్రీదేవి పేరు ప్రకటించేటప్పుడు స్వయంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. మామ్ చిత్రంలో ఉత్తమనటనకు గానూ శ్రీదేవి ఉత్తమనటిగా ఎంపికయ్యారని, ఆమెతో తనకున్న అనుబంధం కారణంగా మాత్రం ఈ అవార్డు ప్రకటించడం లేదని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు.
ప్రతిరోజూ తాను అక్కడకు రాగానే ప్రతి ఒక్కరినీ మళ్లీ ఓటు వేద్దామని అడిగేవాడినని, అందరు నటులతో మాట్లాడేవాడినని, కచ్చితంగా శ్రీదేవి ఉండకూడదు అనేవాడినని శేఖర్ కపూర్ చెప్పారు. అయితే ఓటింగ్ నిర్వహించిన ప్రతిసారీ అది శ్రీదేవి వైపే మళ్లేదని తెలిపారు. శ్రీదేవి పేరు ఉండకూడదని తాను పోరాడానని, శ్రీదేవి విషయంలో తామంతా చాలా భావోద్వేగంతో ఉన్నామని ఆయన అన్నారు. శ్రీదేవికి అవార్డు ఇవ్వకండని, ఆమె చనిపోయిందని, మిగతా నటీమణులకు అన్యాయం చేసినట్టవుతుందని, వారంతా 10 నుంచి 12 ఏళ్ల పాటు తమ కెరీర్ లో కష్టపడ్డారని తాను జ్యూరీ సభ్యులతో చెప్పినట్టు శేఖర్ కపూర్ మీడియాతో అన్నారు. అటు మామ్ చిత్ర దర్శకుడు రవి ఉద్యవార్ మాత్రం ఈ అవార్డుకు ఆమె నూరుశాతం అర్హురాలని సంతోషం వ్యక్తంచేశారు. తాను చాలా ఆనందంగా ఉన్నానని, ఇదొక గొప్పవార్తని, ఈ సినిమా కోసం శ్రీదేవి అత్యద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు.