పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుంద్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించి అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్‌కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది.
ఇక హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్‌పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.