నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) గురువారం నాడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగా, ఆ కార్యక్రమంలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ దురదృష్టకరమైన ఘటనపై పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటూ, తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా ఈమేరకు స్పందించిన నటుడు శివాజీ రాజా ఈ ఘటనపై కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాగా చిరంజీవి గారి లాంటి పెద్దలు వేదిక మీద ఉండగానే అలాంటి ఘటనలు జరగడం అనేది బాధాకరంగా ఉందని ఆయన వాఖ్యానించారు. అంతేకాకుండా పెద్దలు అని సభకి పిలిచి ఇలా అవమానించడం అనేది దారుణం అని శివాజీ రాజా తెలిపారు.
ఇకపోతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఇంత కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా సరిగ్గా పని చేయట్లేదని, ఒక్క రూపాయికి కూడా లెక్క తెలియని ప్రెసిడెంట్ దీనిపై ఎలా స్పందిస్తారు అంటూ ప్రశ్నించారు. కాగా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా తమపై తప్పుడు నిందలు మోపారని, ఆ నిందలన్నీ తప్పుడు మాటలు అని తెలిసాక కూడా ఇంత వరకు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని విమర్శించారు. ఇకపోతే రాజశేఖర్ చాలా భావోద్వేగాలు ఉన్న వ్యక్తి అని, “మా” కి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు బయటికి చెప్పుకోలేదని శివాజీ రాజా స్పష్టంచేశారు. కాగా “మా” కి విరాళాలు ఇవ్వటానికి దాతలు వస్తే, వారిని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ అవమానించి వెనక్కి పంపించాడని, ఇలాంటి అధ్యక్షుడు “మా” కి ఉండటం చాలా దురదృష్టకరమని శివాజీ రాజా పేర్కొన్నారు.