యువ క్రీడాకారిణి ఆత్మహత్య

యువ క్రీడాకారిణి ఆత్మహత్య

జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం తోటి క్రీడాకారులని దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్‌కతాలో తాను ఉంటున్న హాస్టల్‌లో కొనికా లాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్‌లో రాణించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు నెలల్లో నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య చేసుకున్నారు.

2021లో సోనూసూద్ రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా అందించడం ద్వారా ఈ క్రీడాకారిణీ వార్తల్లో నిలిచింది. కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది. కోనికా లాయక్ జనవరిలో సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్‌ చేసింది. అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించాను. అయితే, ప్రభుత్వం నుంచి నాకు ఏమాత్రం సహాయం లేదు. దయచేసి రైఫిల్‌తో సహాయం చేయండి.. దయచేసి సహాయం చేయండని ట్వీట్‌ చేసింది. తాను ఈ ట్వీట్‌ని సోనూ సూద్‌తో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అధికారిని కూడా ట్యాగ్ చేసింది.