Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు అనేక ప్రకటనల్లో కనిపిస్తుంటారు. నిజానికి ఆ ఉత్పత్తులను వారు ఉపయోగిస్తారో లేదో తెలియదు. ప్రకటనల్లో వారు చెప్పే మాటల్లో ఎంత నిజముందో అర్ధం కాదు. కానీ అందరూ వారి ప్రకటనలను ఇష్టంగా చూస్తారు. ఆ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తిచూపుతారు. అయితే ప్రకటనల్లో చెప్పిన దానికి భిన్నంగా నటీనటులు వ్యవహరిస్తే మాత్రం ప్రేక్షకులు చూస్తూ ఊరుకోరనేదానికి శ్రద్ధాకపూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలే ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే..తుమ్హారీ సులు సినిమాలో విద్యాబాలన్ రేడీయో జాకీ సులోచనగా నటించింది. అయితే సినిమాలో విద్య చాలా లావుగా కనిపించిందని, ఆమె అందంగా లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై విద్య కూడా దీటుగానే స్పందించింది.
తానిలానే ఉంటానని, నటన గురించి పట్టించుకోవాలి గానీ..లావు గురించి మాట్లాడకూడదని విద్య బదుల్చింది. దీంతో ఆమెపై విమర్శలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధాకపూర్ విద్యకు మద్దతుగా ఓ పోస్ట్ చేసింది. హాలీవుడ్ దివంగత హీరోయిన్ మార్లిన్ మన్రో ఫొటోను పోస్ట్ చేసిన శ్రద్ధ ఆమె పొట్ట టోన్డ్ కాదని, శరీరం బిగుతుగా ఉండదని, అయినా ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ఆదరణతో పాటు శృంగార దేవతగా నీరాజనాలు అందుకుందని వ్యాఖ్యానించింది. శరీర సౌష్టవం అనేది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుందని కూడా కామెంట్ చేసింది. శ్రద్ధ పోస్టుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరి శరీరం వారి ఇష్టమైనప్పుడు గ్రీన్ టీ కోసం ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. స్లిమ్ గా ఉండండి…స్లిమ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ గ్రీన్ టీ తాగండి అని ఎందుకు చెబుతున్నావు….డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా…? హిపోక్రాట్ అని విమర్శిస్తున్నారు.