తాజాగా శృతిహాసన్ ఓ తెలుగు టాక్ షో ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో పాల్గొన్న శృతి తన బ్రేకప్‌తో పాటు ఇతర అంశాలను కూడా వెల్లడించారు. అలాగే.. ప్రస్తుతం తాను మద్యానికి దూరంగా ఉంటున్నానని.. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని తెలిపారు. అయితే ఈ షో తర్వాత కొందరు శృతి ఆల్కహాలిక్ అంటూ కామెంట్లు చేయడం, సెటైర్లు వేయడం ప్రారంభించారు. వీటిపై స్పందించిన శృతి.. తన వ్యాఖ్యలపై సమయం, సందర్భం లేకుండా ద్వందార్థాలు తీయడంపై మండిపడ్డారు. అలాగే తన వ్యాఖ్యలను వక్రీకరించే వారికి ఘాటైన సమాధానం ఇచ్చారు.
ఆ టాక్ షోలో నేను మాట్లాడుతూ మద్యానికి దూరంగా ఉంటున్నానని.. ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని చెప్పాను. కానీ ఆ వ్యాఖ్యలు కొందరికి సరిగా అర్థం కాలేదు. ఇటీవలి కాలంలో డ్రింకింగ్ అనేది కామన్‌గా మారింది. దీని వల్ల వ్యక్తి ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ నేను ఈ పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటున్నాను. డ్రింక్ చేసే వాళ్లను నేను జడ్జ్ చేయలేను. ప్రతి ఒక్కరు తాగుతారు కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. పైగా చాలా మంది తాము డ్రింక్ చేస్తామని అంగీకరించరు. 2019లో ఉండి కూడా ఇలా చేయడం హాస్యాస్పదం. మద్యానికి దూరంగా.. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని నేను చెప్పినప్పుడు.. ఆ వ్యాఖ్యలను ఎందుకు వేరే రకంగా మార్చారని శృతి ప్రశ్నించారు.
మరోవైపు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్.. విదేశాల్లో పలు మ్యూజిక్ ప్రదర్శనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను లండన్‌లో గడిపిన జీవితం గురించి కూడా తెలిపారు. యూకేలో నాకు ఎవరు తెలియదు. కానీ అక్కడ నేను ఒక ఇళ్లు లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగాను. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మ్యూజిక్ మీద ఎక్కువ దృష్టి సారించాను. ఇంతకు ముందు తెలియని కొత్త వాళ్లను కలవడం నాలో చాలా ఉత్సాహం నింపింది. ఈ డిసెంబర్‌లో అక్కడికి మళ్లీ వెళతాను. నేను ఉత్తమమైన జీవితం గడుపుతున్నాను. సినిమాల్లో మంచి గుర్తింపు పొందాను. కానీ నా వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను అవిష్కరించనప్పుడే పూర్తి విజయాన్ని సాధించనట్టు అవుతోంది. నా జీవితంలో కొద్దిగా ఉత్తేజం నింపుకోవడానికి సినిమాలకు విరామం ఇచ్చానని తెలిపారు. కాగా, శృతి ప్రస్తుతం విజయసేతుపతితో లాభం చిత్రంలో నటిస్తున్నారు. ఓ హిందీ చిత్రంలో నటించేందుకు కూడా శృతి అంగీకరించినట్టుగా సమాచారం.