Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మక్కామసీదు పేలుళ్ల కేసు తీర్పు తరువాత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులు నిర్దోషులని తీర్పు ఇచ్చిన ఎన్ ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పంపారు. కోర్టు తీర్పుపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా సంచలనంగా మారింది. 2007లో జరిగిన మక్కామసీదు పేలుడు ఘటనపై 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్ ఐఏ కోర్టు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నేరాన్ని రుజువుచేసేటంత బలమైన సాక్ష్యాలను నిందితులకు వ్యతిరేకంగా కోర్టుకు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని న్యాయమూర్తి రవీందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుపై కొన్ని వర్గాలు సానుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా స్పందించాయి. ఈ తీర్పు వందశాతం అన్యాయమైందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన 9మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ ఐఏ వ్యవహరించాయని ఆరోపించారు. అప్పట్లో అరెస్టయిన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినప్పటికీ… ఎన్ ఐఏ సవాల్ చేయలేదని, ఈ కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏ ఏమీ చేయలేదని, ఇందులో రాజకీయజోక్యం ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదముందని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు.