మీరు సాధించిన విజ‌యాల‌ను పేప‌ర్ చూస్తూ అయినా మాట్లాడ‌గ‌ల‌రా…?

Siddaramaiah counter attacks on Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీ స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో క‌ర్నాట‌క రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. తాను పార్ల‌మెంట్ లో 15 నిమిషాలు మాట్లాడితే మోడీ స‌భ‌లో కూర్చోలేర‌న్న రాహుల్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ… ప్ర‌ధాని మోడీ కాంగ్రెస్ అధ్య‌క్షునికి ఓ స‌వాల్ విసిరారు. మంగ‌ళ‌వారం క‌ర్నాట‌క‌లో ఐదురోజుల ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించిన ప్ర‌ధాని సంతెమార‌హ‌ళ్లి బ‌హిరంగ‌స‌భ‌లో రాహుల్ 15 నిమిషాల పేప‌ర్ చూడ‌కుండా మాట్లాడాల‌ని స‌వాల్ చేశారు.

క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ సాధించిన విజ‌యాల‌ను హిందీ లేదా ఆంగ్లం లేదా త‌న త‌ల్లి మాతృభాష ఇటాలియ‌న్ లో 15 నిమిషాల పాటు పేప‌ర్ చూడ‌కుండా రాహుల్ మాట్లడాల‌ని ప్ర‌ధాని ఎద్దేవాచేశారు. ప్రధాని వ్యాఖ్య‌ల‌పై క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ట్విట్ట‌ర్ లో స్పందించారు. క‌ర్నాట‌క‌లో గ‌తంలో య‌డ్యూర‌ప్ప స‌ర్కార్ సాధించన‌వేమిటో 15 నిమిషాలు పేప‌ర్ లో చూసుకుంటూ అయినా ప్ర‌ధాని మాట్లాడాల‌ని ప్ర‌తిస‌వాల్ విసిరారు. మొత్తానికి బ‌హిరంగ‌స‌భ‌ల్లోనూ, ట్విట్ట‌ర్ వేదిక‌గానూ జ‌రుగుతున్న ఈ స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు క‌ర్నాట‌క రాజ‌కీయాన్ని ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తున్నాయి.

అటు న‌మో యాప్ ద్వారా క‌ర్నాట‌క‌లోని బీజేపీ కిసాన్ మోర్చా కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన ప్ర‌ధాని సిద్ధరామ‌య్య ప్ర‌భుత్వంపై మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల సంక్షేమాన్ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం పూర్తిగా విస్మ‌రించింద‌ని ప్ర‌ధాని దుయ్య‌బ‌ట్టారు. రైతుల్ని సాధికారుల‌న్ని చేయ‌డమే లక్ష్యంగా బీజేపీ ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. య‌డ్యూరప్ప క‌ర్ష‌కనేత అని, ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిని చేస్తే క‌ర్నాట‌క రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే ల‌క్ష్యంగా కేంద్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్టిన వేర్వేరు కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాని వివ‌రించారు.