దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిల మధ్య చాలా పోలికలు ఉన్న విషయం తెలిసిందే. కెరీర్‌ను ఒకే విధంగా నిర్మించుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పరుగులు, శతకాలు, రికార్డుల విషయంలోనే కాకుండా మరో ఆసక్తికర విషయంలోనూ పోలిక ఉంది. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ అంశం తెరపైకి వచ్చింది.
గతంలో సచిన్‌ను సారధ్య బాధ్యతల నుంచి అవమానకర రీతిలో ఎలా తొలగించారో.. అచ్చం అలానే కోహ్లి విషయంలోనూ జరిగింది. నాడు సచిన్‌కు సైతం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. ఇప్పుడు కోహ్లి విషయంలోనూ అలానే చేసింది. తనను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయాన్ని బీసీసీఐ ముందస్తుగా చెప్పలేదని, మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం చాలా బాధించిందని, అవమానకర రీతిలో తనను తప్పించడం కలచి వేసిందని సచిన్ తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో ప్రస్తావించగా.. తాజాగా కోహ్లి ప్రెస్‌మీట్ పెట్టి బీసీసీఐ తన పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టాడు.
ఇదిలా ఉంటే, భారత జట్టు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఈ ఇద్దరు లెజెండ్స్‌ను అవమానకర రీతిలో కెప్టెన్సీ నుంచి తొలగించడానికి గల ప్రధాన కారణం వారికున్న స్టార్ డమ్యేనని సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయపడుతున్నాడు. వీరి క్రేజ్.. బీసీసీఐకి మించి ఉండడం వల్లే అలా జరిగి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నారు. వారి రేంజ్‌ను తగ్గించడానికి బీసీసీఐ ఇలా అవమానించడం సరికాదని అంటున్నారు. కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయాన్ని బీసీసీఐ కేవలం గంటన్నర ముందే తనతో చెప్పిందని కోహ్లి నిన్నటి ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.