పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, తోటి కార్మికుల కథనం ప్రకారం.. రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్–2లో మట్టి తొలగింపు పనులను సింగరేణి యాజమాన్యం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఇక్కడ మట్టి తొలగించేందుకు నిత్యం బ్లాస్టింగ్ నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం షిఫ్టు విధులకు వెళ్లిన కార్మికులు బ్లాస్టింగ్ కోసం ముందుగా వేసిన డ్రిల్స్‌లో బ్లాస్టింగ్ ఇన్చార్జి, డిప్యూటీ మేనేజర్ ఎ.మధు, ఓవర్‌మెన్ మామిడి సతీశ్ పర్యవేక్షణలో డిటోనేటర్లు అమర్చి, రసాయనాలు నింపుతున్నారు. 31వ డ్రిల్స్‌లో పేలుడు పదార్థాలు నింపిన కార్మికులు 32వ డ్రిల్ బోల్టర్ (పెద్ద బండరాయి)కి వేశారు. 10:25 గంటలకు అందులో డిటోనేటర్ అమర్చి రసాయనం నింపే పనిని కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్ రాజన్న బెల్కివార్ (27), బండారి ప్రవీణ్ (37), ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికునిగా పని చేస్తున్న కమాన్‌పూర్ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48), కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి పంచాయతీ పరిధి శాలపల్లికి చెందిన కుందారపు వెంకటేశ్, జూలపల్లికి చెందిన బండి శంకర్, రత్నాపూర్ పంచాయతీ పరిధి రాంనగర్‌కు చెందిన కొదురుపాక భీమయ్య చేపట్టారు.
ఈ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బిల్ల రాజేశం, రాకేశ్‌రాజన్న బెల్కివార్, బండారి ప్రవీణ్, బండి అర్జయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న వెంకటేశ్, బండి శంకర్, కొదురుపాక భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఓ వాహనంలో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుందారపు వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చెల్లాచెదురుగా పడిన నలుగురి శరీర భాగాలను మరో వాహనంలో తీసుకెళ్లారు.