నైనీ గని ప్రారంభం దిశగా..

singareni cmd meets odissa cm

ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థ వచ్చే ఏడాది ప్రారంభించనున్న నైనీ బొగ్గు బ్లాకు కోసం ఉన్నతస్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేసింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్య ప్రసాద్‌పాఢిని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ బుధవారం భువనేశ్వర్‌లో కలిశారు. ముందుగా సీఎస్ ఆదిత్య ప్రసాద్‌పాఢితో సమావేశమై నైనీ బ్లాకుకు సంబంధించిన పలుఅంశాలను వివరించారు. రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఒడిశా అంగూల్ జిల్లాలోని నైనీ బ్లాకును సింగరేణికి కేటాయించిందని, దీనికి సంబంధించిన అటవీ, రెవెన్యూ భూముల బ దలాయింపు, పునరావాస, రైల్వేలైను ఏర్పా టు తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నామన్నారు. భూముల సేకరణ అనుమతులకు, ప్రస్తుతం నిర్మించనున్న రైల్వేలైనును నైనీ బ్లాకు వరకు కొనసాగించడానికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలని సీఎండీ శ్రీధర్ కోరారు. పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా సీఎస్ హామీఇచ్చారు.

నైనీ బొగ్గు నిల్వలు 34 కోట్ల టన్నులు

ఒడిశాలో వచ్చే ఏడాది ప్రారంభించనున్న నైనీ బొగ్గు క్షేత్రం సింగరేణికి వరంగా మారనున్నది. 34 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాకు నుంచి ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తికి సంస్థ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ బ్లాకును నిర్దేశిత సమయంలో ప్రారంభించడానికి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జనరల్ మేనేజర్ విజయరావును ఈ గని వ్యవహారాల పర్యవేక్షణ అధికారిగా నియమించి, ప్రతినెలా పురోగతి సమీక్షిస్తున్నారు. ఛెండిపడ తాసిల్ పరిధిలో నైనీ బొగ్గు బ్లాకు ప్రభావిత గ్రామాలైన థలీపాసి, కుడాపాసి, కాసిదిహ, దౌరాఖమాన్, భీం భద్రపూర్, టెంటులోయి గోపినాథ్సూర్‌లల్లో ఇప్పటికే పలు సమాజహిత కార్యక్రమాలను మొదలెట్టారు.

ఒడిశాకు సింగరేణి చేయూత

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సతమతమైన ఒడిశాకు చేయూతగా సింగరేణి తరపున రూ.కోటి చెక్కును సింగరేణి సీఎండీ శ్రీధర్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అందజేశారు. వరద సమయంలో సింగరేణి నుంచి రెస్క్యూ బృందాలు, వైద్యబృందాలను పంపి 20 రోజులపాటు సేవలందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో మైనింగ్ సలహాదారు డీఎన్ ప్రసాద్, జీఎం విజయారావు, డీజీఎం రవీంద్ర చౌదరి పాల్గొన్నారు.