ఓయూ డిగ్రీ కాలేజీలకే డిమాండ్

huge demand for osmania university

రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలకే అధిక డిమాండ్ ఉన్నది. ఆయా కళాశాలల్లో చేరడానికే విద్యార్థులు అధిక ఆసక్తిచూపుతున్నారు. అన్ని వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో 1,19,098 సీట్లు నిండగా.. వాటిలో ఓయూ కాలేజీల్లోనే 47,487 సీట్లు (39.87 శాతం) భర్తీ అయ్యాయి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ పరిధి కాలేజీల్లో 32,198 సీట్లు (27శాతం)నిండాయి. శాతావాహన యూనివర్సిటీ పరిధిలో 14,392 సీట్లు, తెలంగాణ వర్సిటీ పరిధిలో 9,683 సీట్లు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 9,011 సీట్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 6,321సీట్లు, టీఎస్ ఎస్బీటీఈటీ పరిధిలోని కాలేజీల్లో ఆరు సీట్లు భర్తీఅయ్యాయి. బుధవారంనాటికి కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల తుదిజాబితాను దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ప్రభుత్వ అన్ని రకాల డిగ్రీ కాలేజీల్లో మొత్తం 38,650 సీట్లు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 79,562, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో 790 సీట్లు, రైల్వే డిగ్రీ కాలేజీల్లో 96 సీట్లు నిండినట్టు వివరించారు.

2,344 మందికి బ్రాంచ్‌లో మార్పులు

దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా కాలేజీలో ఒక బ్రాంచ్‌నుంచి మరొక బ్రాంచ్‌లో మారడం కోసం 2,947 మంది విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకోగా.. వారిలో 2,344 మందికి మార్పులు జరిగాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ నెల 13 తర్వాత వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత దోస్త్ తుదివిడుత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని కన్వీనర్ తెలిపారు.