Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫిలింనగర్ లోని మా అసోసియేషన్ ముందు అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన నటి శ్రీరెడ్డి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. శ్రీరెడ్డి నిరసన వార్తను నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. ప్రముఖ ఇంగ్లిష్ పత్రికలు కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియని కొందరు ముంబై వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లడుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. అటు శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వడం జరగని పనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా తేల్చిచెప్పారు. అంతేకాకుండా మా అసోసియేషన్ లో ఉన్న 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించబోరని, ఒకవేళ ఎవరైనా ఆమెతో నటిస్తే అసోసియేషన్ నుంచి వారిని తొలగిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వంకావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని, అవి ఎవరికైనా ఒకటేనని అన్నారు. దుస్తులిప్పుకుని తిరిగితే సభ్యత్వంరాదని, కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే శ్రీరెడ్డి దిగజారుడు వ్యాఖ్యలుచేస్తూ, అర్ధనగ్నంగా తిరిగిందని మండిపడ్డారు. అనవసరంగా ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని తెరపైకి లాగుతోందని ఆరోపించారు. హీరోయిన్లు చిన్నవారైనా, పెద్దవారయినా ఏ సమస్య వచ్చినా తాము పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ తేజ ఆమెకు రెండు అవకాశాలు ఇచ్చారని, వాటిని చేసుకోక టీవీ చానల్స్ కు ఎక్కి విమర్శలు గుప్పిస్తోంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని, ఇప్పుడు ఆ రెండు అవకాశాలు కూడా ఆమెకు దూరమైనట్టేనని వ్యాఖ్యానించారు. మరోవైపు శ్రీరెడ్డి తన చర్యను సమర్థించుకున్నారు. నిరసన తరువాత తనకు ఇక అవకాశాలు రావని, తనకు నటించాలన్న ఆసక్తి కూడా లేదని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తెలుగు అమ్మాయిల కోసమే తాను గళమెత్తుతున్నానని, ఇప్పటివరకూ టాలీవుడ్ కు తాను చేతనైనంత సేవ చేశానని చెప్పారు. తనను నగ్నంగా నిలబెట్టిన టాలీవుడ్ కు ఇది బ్లాక్ డే అని, తెలుగు కళామతల్లికే ఇది సిగ్గుచేటని, తన యుద్ధం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు