అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసి, టాలీవుడ్ లో కలకలం రేపుతున్న హీరోయిన్ల సెక్స్ రాకెట్ ఇప్పుడు చాలా మంది ఎన్నారైలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొందరు హీరోయిన్లు అక్కడ కేవలం కాలక్షేపం కోసమే అని చేబుతున్నా తెరవెనుక ఏమి జరిగిందో అప్పుడే చెప్పలేమంటున్నారు అమెరికా పోలీసులు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారి బట్టబయలు చేసిందని తెలుస్తోంది. గత జనవరి 23నే మోదుగుమూడి దంపతులను ఓహియోలో బోర్డర్ సాధారణ తనిఖీలలో భాగంగా పెట్రోల్ అధికారులు అడ్డగించారు. 2016 ఆగస్టు 8తోనే వారి వీసా గడువు పూర్తయినట్లు గుర్తించి అరెస్టు చేయడంతో వీరు ఫిబ్రవరి 23 న బెయిల్‌పై బయటకు వచ్చారు. కిషన్ దంపతులను అరెస్టు చేసినప్పుడు వారి నుంచి అధికారులు అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అందులో మారియట్ హోటల్ పేరుతో ఉన్న పేపర్‌లోని చేతిరాతతో ఉన్న అక్షరాలు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. అందులో ఒకచోట వాషింగ్టన్ డీసీ దాని పక్కన ఓ సినీనటి పేరు, జనవరి 19 ఉదయం రూం.నెంబర్ 207 అని, మరోచోట జనవరి 19, వెంకట్, రూం. నెంబర్ 404 అని ఇలా చాలా మంది పేర్లు, హోటల్ రూమ్ నెంబర్లు రాసి ఉండటంతో దర్యాప్తు అధికారులకు ఇదేదో వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారమేనన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం నిర్దరణ చేసుకోవడానికి ఫిబ్రవరి 16 న కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంలో కండోమ్స్‌తోపాటు ఐదు డైరీలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డైరీల్లోనూ అనేక మంది పేర్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడటంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. వాటిలో ఉన్న పేర్లను బట్టి నటులు, నటీమణులను విచారించారు. దాంతో వారి చీకటి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఆరుగురు నటీమణుల పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టి, అభియోగాలపై విచారణను ప్రారంభించనున్నామని, ఆపై నెల రోజుల వ్యవధిలోగా కేసు కొలిక్కి వస్తుందని విచారిస్తున్న అధికారులు భావిస్తున్నారు. కిషన్ దంపతుల నేరాలపై కీలక ఆధారాల కోసం చూస్తున్నామని, అవి లభిస్తే, విచారణ సులువవుతుందని, శిక్ష పడితే మాత్రం అది పూర్తయిన తరువాత వారిని దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని, ఈ దందాలో మరింత మంది ప్రమేయం ఉండవచ్చని అన్నారు.