ఓ పాము పార్లమెంటులోకి ప్రవేశించింది. సీరియస్‌గా సాగుతున్న సభను వాయిదా వేసింది. సభలోకి పాము వచ్చిందని తెలియగానే ఎంపీలంతా బయటకు పరుగులు పెట్టారు. ఇంకొందరు బల్లలెక్కి బిక్కు బిక్కుమంటూ గడిపారు. ప్రజా ప్రతినిధులు ఉండే సభలో చీమ కూడా దూరనంత సెక్యూరిటీ ఉంటుంది.
మరి, పాము ఎలా దూరిందనేదీ అంతుచిక్కని ప్రశ్న. ఈ అరుదైన ఘటన నైజీరియాలోని అండోలో చోటుచేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో ఓ పాము సీలింగ్ పై నుంచి కింద పడింది. దీంతో బెంబేలెత్తిన ఎంపీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. సభ్యులు భయాందోళనలు వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు. పామును వెతికి పట్టుకోవాలని, సభ మొత్తం తనిఖీలు చేసి.. అన్నివిధాలా సురక్షితమని చెప్పిన తర్వాతే మళ్లీ సమావేశాలు మొదలవుతాయని తెలిపారు.
ఈ ఘటనలపై పార్లమెంట్ అధికార ప్రతినిధి ఒలుగ్‌బెంగా ఓమోలే మాట్లాడుతూ.. ‘‘చాంబర్‌లోకి అడుగు పెట్టగానే పెద్ద పాము పైనుంచి పడింది. దీంతో వెంటనే సభను ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయాం. ఆ పాము ఎవరికీ హాని చేయలేదు’’ అని తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయించడం లేదని, బకాయిలు కూడా చెల్లించకపోవడం వల్ల నిర్వాహణ పనులు ఆగిపోయాయని తెలిపారు. ఫలితంగా పాములు ప్రవేశిస్తున్నాయన్నారు.