అవును ఆ అమ్మాయి గూగుల్ నే మాయ చేసింది అందుకే ఏడాదికి 1.2 కోట్ల వేతనంతో కొలువు పట్టేసింది. భారత దేశవ్యాప్తంగా గూగుల్ నిర్వహించిన ప్రాంగణ నిమాయకాల్లో ఐదుగురు ప్రతిభావంతులను ఎంపిక చేసుకుంది. వారి అందరికీ ఒక్కొక్కరికీ రూ.1.2 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్ ఉద్యోగం ఇచ్చింది. ఈ ఐదుగురిలో ఓ తెలుగుమ్మాయికి కూడా చోటు దక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐఐటీ హైదరాబాద్ లో విద్యనభ్యసిస్తున్న కుడుగుంట స్నేహారెడ్డిని కృత్రిమ మేధపై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయడానికి ఎంపిక చేసింది.
వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి ఐఐటీ హైదరాబాద్ నుంచికంప్యూటర్ సైన్స్‌లో తాజాగా బీటెక్ పూర్తి చేశారు. చదువుతోపాటు మిగతా విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన స్నేహా స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకుంది. స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో జెం. పోటీ పరీక్షలకు హాజరైతే ర్యాంకు రావాల్సిందే. అంత ప్రజ్ఞాశాలి అయిన స్నేహారెడ్డి 98.4 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించారు. జేఈఈ 2014 (మెయిన్స్)లో ఆలిండియా 15వ ర్యాంకు, జేఈఈ(అడ్వాన్సుడ్)లో 677వ ర్యాంకును సాధించారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. ‘నేచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్’ ప్రాజెక్టులో పనిచేసేం దుకు గూగుల్ యువరక్తం కోసం అన్వేషిస్తున్న విషయం తెలుసుకుని స్నేహారెడ్డి దరఖాస్తు చేసుకుంది.
ఆన్‌లైన్‌లో జరిగిన తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక చిట్టచివరి పరీక్ష కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా, అదే సమయంలో మరో ముఖ్యమైన పరీక్ష ఉండడంతో వెళ్లలేకపోయింది. అయితే, ఆమె టాలెంట్ ను గుర్తించిన గూగుల్ ఆ ముఖ్యమైన పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించి అందులో కూడా ఉత్తెర్నత సాదించిన స్నేహకు ఏడాదికి రూ.1.20 కోట్ల వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసింది. దీంతో ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థిగా స్నేహారెడ్డి గుర్తింపు దక్కించుకున్నారు. స్నేహారెడ్డితోపాటు గూగుల్‌కు ఎంపికైన వారిలో ఐఐఐటీ బెంగళూరు విద్యార్థిని కూడా ఉన్నారు. అయితే తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరెన్నో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా పరిశోధనలకు అవకాశం ఉంటుందనే గూగుల్‌ను ఎంచుకున్నట్టు స్నేహారెడ్డి తెలిపింది.