బీజేపీ ఆపరేషన్ గరుడలో భాగం అని విమర్శలు ఎదుర్కొంటున్న జనసేనాని ఆ వ్యాఖ్యలకు విరుగుడుగా మహాకూటమి ఏర్పాటు చేయాలని తలపోస్తున్నారు. ఈ మధ్యే 175 స్థానాలకు పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పవన్ నేరుగా ఆ విషయం చెప్పకపోయినా ఆయనతో తరచూ రాజకీయ చర్చలు , సంప్రదింపులు జరుపుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఆ కూటమిలో జనసేన సారధ్య బాధ్యతలు వహిస్తే , వామపక్షాలు , లోక్ సత్తా , ఆమ్ ఆద్మీ అందులో భాగస్వాములుగా వుంటాయని రామకృష్ణ ప్రకటించారు. వైసీపీ తో కలిస్తే రాజకీయంగా జనసేన కూడా దెబ్బ తింటుందని హెచ్చరించిన రామకృష్ణ ఈ కలల మహాకూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ మహాకూటమికి నాయకత్వ పగ్గాలు పట్టుకోవాల్సిన జనసేనకు ఆ సత్తా ఉందా , అందులో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటో తెలుసా ?
జనసేన మహాకూటమి ఏర్పాటు చేస్తే చాన్నాళ్లుగా ఓ పెద్ద పార్టీ అండ కోసం చూస్తున్న వామపక్షాలు ఒక్క క్షణం ఆలోచించకుండా అందులో చేరిపోతాయి. అయితే వెస్ట్ బెంగాల్ , త్రిపుర లో సైతం ఓట్ బ్యాంకు కోల్పోయి అస్తిత్వమే ప్రమాదంలో పడ్డ వామపక్షాలు పవన్ కి భారమే తప్ప ప్రయోజనం లేదు. కాకుంటే బీజేపీ కి జనసేన అనుకూలం అన్న ముద్ర నుంచి బయటపడేందుకు మాత్రం పనికి వస్తుంది . ఇక ఈ కూటమిలో మిగిలిన రెండు పార్టీల విషయంలో పవన్ , రామకృష్ణల కలలు నెరవేరే అవకాశం చాలా తక్కువ. లోక్ సత్తా ఇప్పటికే ఎన్నికల రాజకీయాలకు దూరంగా వుండాలని భావించడం ఒక ఎత్తు అయితే , ఆ మధ్య పవన్ వేసిన ఓ ఎత్తుగడ లోక్ సత్తా రాకకి పెద్ద స్పీడ్ బ్రేకర్ అవుతోంది. విభజన హామీలు , నిధుల విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వాదనలో నిజాలు నిగ్గు దేలుస్తామంటూ అప్పట్లో జనసేన ఏర్పాటు చేసిన కమిటీ లో జయప్రకాశ్ నారాయణ కీలక పాత్ర పోషించారు. అయితే లెక్కలన్నీ తేల్చిన తరువాత పవన్ దానిపై ఏ కార్యాచరణ ప్రకటించకపోవడం మీద జయప్రకాశ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనసేన మాటలు నమ్మి ఎన్నికల ఎపిసోడ్ లోకి అడుగు పెట్టేందుకు జయప్రకాశ్ ఆసక్తి చూపించే అవకాశాలు లేనట్టే.
ఇక ఈ కూటమిలో వాడిన ఇంకో పార్టీ పేరు ఆమ్ ఆద్మీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారధ్యంలో నడుస్తున్న ఆమ్ ఆద్మీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. ఆ పార్టీని నడిపిస్తున్న అమిత్ షా తో పాటు అడుగడుగునా పాలనాపరమైన ఇబ్బందులు తెస్తున్న ప్రధాని మోడీ. వారిపై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ముందు వున్నారు. ఇటీవల ఢిల్లీలో దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ ని పలకరించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలతో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ వైపే ఆమ్ ఆద్మీ ఉంటుందని తేలిపోయింది. అంటే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ లోనే ఆ పార్టీ ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల్లో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్న జనసేన తో ఆమ్ ఆద్మీ జట్టుకట్టే ఛాన్స్ లేనట్టే. ఈ పరిణామాలు చూసినప్పుడు జనసేన మహాకూటమికి ఆరంభానికి ముందే బ్రేక్ పడ్డట్టే.