అత్తగారింట్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఆడెపు సాయిలక్ష్మి(28)కి పద్నాలుగు నెలల క్రితం కోరుట్లలోని గాంధీరోడ్డులో నివాసం ఉండే కొండబత్తిని రామకృష్ణతో వివాహం జరిపించారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఇద్దరూ హోం టు వర్క్‌ కింద కోరుట్లలోని తమ ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. సాయిలక్ష్మీ ఇటీవల ఉద్యోగం మానేసింది. మరో జాబ్‌ కోసం ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో విజయవాడలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సాయిలక్ష్మీ తనగదిలోకి వెళ్లి లోపల గొళ్లెం పెట్టి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొంతసేపటికి భర్త రామకృష్ణ వచ్చి సాయిలక్ష్మీ ఆత్మహత్య విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొళ్లెం తొలగించి గదిలోకి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. తహసీల్దార్‌ సత్యనారాయణ వివరాలు సేకరించారు. అయితే, తమ కూతురు సాయిలక్ష్మీని ఉద్యోగం చేయాలని, అదనంగా కట్నం తేవాలని అత్తింటివారు వేధించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆడెపు సత్యనారాయణ–జయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.