భూ వివాదాల నేపథ్యంలో కన్నతల్లిని పాశవికంగా కన్నకొడుకే హతమార్చిన ఘటన మండలంలోని శ్రీరామవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో పేరుబోయిన సరోజిని (55) మృతిచెందింది. ఈమె కొడుకు శ్రీను తల్లిని అత్యంత కర్కశంగా నరకడంతో మొండెం, తల వేరయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
టి.నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పేరుబోయిన సరోజిని భర్త నాగరాజు 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు, కుమార్తె వివాహాలు అయ్యాయి. తల్లి చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. తనకున్న 5 ఎకరాల భూమిని ఎకరంన్నర చొప్పున పంచిపెట్టింది. దీంతో పెద్ద కుమారుడు శ్రీను తన వాటాగా వచ్చిన భూమిలో నిమ్మతోట వేశాడు. అనంతరం నిమ్మతోటను కౌలుకు ఇచ్చాడు.
కుటుంబంలో రూ.3 లక్షల వరకు బాకీ ఉందని, వాటిని తీర్చాలని తల్లి ముగ్గురిని కోరింది. బోరు వేసేందుకు అప్పు చేశామని, బాకీ తీరే వరకు నిమ్మకాయలు కోయడం కుదరదని తల్లి సరోజిని కౌలు రైతుకు చెప్పడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కౌలు రైతు నిమ్మకాయలు కోస్తుండగా సరోజిని అడ్డుకుంది. దీంతో తోటలో ఉన్న తల్లి సరోజినిని కత్తితో నరికి చంపాడు. సరోజిని శరీరం నుంచి తల వేరై అక్కడే పడిపోయింది.
హత్య చేసిన వెంటనే నిందితుడు గ్రామంలోకి వెళ్లి స్వయంగా గ్రామస్తులకు హత్య విషయం చెప్పాడు. ఈ విషయంపై వీఆర్వో రాంబాబు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై కె.రామకృష్ణలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.