మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే రోకలిబండతో మోది హతమార్చాడో కసాయి. వల్లూరులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌ఐ డి.రవీంద్రబాబు కథనం ప్రకారం.. మండలంలోని వల్లూరుకు చెందిన ఈమని సీతా మహాలక్షి్మ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో సీతా మహాలక్ష్మి తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమారుడు ప్రభాకరరెడ్డి మద్యానికి బానిసయ్యాడు.
రోజూ వచ్చి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి కూడా మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లి సీతామహాలక్ష్మి వెంటపడ్డాడు. తల్లి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ప్రభాకరరెడ్డి ఇంట్లో ఉన్న రోకలి బండతో తల్లి తలపై మోదాడు. దీంతో రక్తపుమడుగులో కొట్టుకుంటూ ఆ వృద్ధ తల్లి మరణించింది. ప్రభాకరరెడ్డి పరారయ్యాడు. సీతామహాలక్ష్మి మరో కుమారుడు సుధాకరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పొన్నూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.