తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువులో ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీలు అన్ని తమ బలాలను సమీకరించుకొని, ప్రజలలో పేరున్న తమ పార్టీ నేతలతో విరామం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాయి. తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్ మరియు సిపిఐ పార్టీలతో కలిసి ఏర్పాటుచేసిన ప్రజాకూటమి నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోదండ రాం లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఆకట్టుకుంటుండగా, కొడంగల్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ, తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
ప్రజకూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా రంగంలోకి దిగి, తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించాక తొలిసారిగా నవంబర్ 23 న తన పాదం మోపి, మేడ్చల్ లో నిర్వహించిన ప్రజా సదస్సులో ప్రసంగించారు. సోనియా గాంధీ రాకతో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనుత్తేజం కలిగిన మాట వాస్తవం. అంతేకాకుండా, ఏఐసీసీ చైర్మన్ రాహుల్ గాంధీ కూడా తెలంగాణాలో ప్రజకూటమి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండడం కాంగ్రెస్ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ఎన్నికల ప్రచార గడువు ముగియకముందే మరోసారి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ప్రసంగిస్తే పార్టీకి మేలుచేస్తుందని భావించిన ప్రజకూటమి అగ్రనేతలు సోనియా గాంధీ ని కోరగా డిసెంబర్ 5 న మరోమారు ప్రజా వేదికలో ప్రసంగించడానికి సమ్మతించారని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారం నుండి స్వల్ప విరామం తీసుకున్న రాహుల్ గాంధీ డిసెంబర్ 3 నుండి మరల ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యి, గద్వాల మరియు తాండూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ప్రజా సదస్సు లో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత మరియు దేశ మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొని డిసెంబర్ 4 న పలు నియోజకవర్గాలలో ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలుస్తుంది.
సోనియమ్మ రాకతో ప్రజకూటమి పార్టీ కి విజయావకాశాలు మరింత పెరుగుతాయని పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.మరోవైపు అధికారపార్టీ అయిన తెరాస పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అలుపన్నది లేకుండా నిరంతరంగా ప్రజాఆశీర్వాద సభలు అంటూ ప్రజా సభలను అన్ని జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ, ప్రజలలోకి చొచ్చుకుపోతున్నారు. తన తండ్రిని మరల సీఎం కుర్చీ ఎక్కించడమే ధ్యేయంగా కేసీఆర్ పుత్రరత్నం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణలోని ప్రత్యేక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, తన మాటలతో ప్రజల ఆలోచనలను మార్చే విధంగా ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా తెరాస పార్టీ విజయం కోసం ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తూ, పార్టీ పురోగతిని సమీక్షిస్తూ, ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. కేసీఆర్ కూతురు ఎంపీ కవిత కి తన ప్రచారంలో ప్రజలనుండి వ్యతిరేకత ఎదురవడంతో పార్టీ శ్రేణులలో కాస్త కంగారు మొదలైనా, మిగిలిన నేతలు తమ ప్రచారంతో ప్రజలను ఆకట్టుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.