Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయిన తర్వాత అందరికీ వచ్చిన సందేహం ఇప్పటిదాకా అధ్యక్షురాలిగా ఉన్న సోనియా ఇకపై పార్టీలో ఎలాంటి పాత్ర పోషించనున్నారని. నెహ్రూ గాంధీ కుటుంబ కోడలిగా 19 ఏళ్ల సుదీర్ఘకాలం అధ్యక్ష హోదాలో కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేశారు సోనియాగాంధీ. రాజకీయాల్లో ఇమడలేరని, కాంగ్రెస్ లాంటి ఘనచరిత్ర ఉన్న పార్టీకి నాయకురాలిగా ఆమె తగరని, అత్త ఇందిరాగాంధీలా నాయకత్వ లక్షణాలు లేవని, అసమర్థ నాయకురాలని ఇలా ఎన్నో విమర్శలు తొలినాళ్లలో సోనియాను చుట్టుముట్టాయి. ఆమె అధ్యక్ష బాద్యతలు చేపట్టిన తర్వాత జాతీయస్థాయిలో అధికారం సంగతి అటుంచి రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ వరుస ఓటములు చవిచూసింది. ఈ తరుణంలో సోనియా ఎక్కువ కాలం అధ్యక్షపదవిలో ఉండబోరని, కాంగ్రెస్ భవిష్యత్ గందరగోళంగా మారుతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ క్రమక్రమంగా కాంగ్రెస్ లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు సోనియా. పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నారు.
పి.వి. నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం వంటి రాజకీయ దిగ్గజాలను సైతం పార్టీలో నోరెత్తలేని పరిస్థితి కల్పించారు. సుదీర్ఘకాలం పార్టీని అంతా తానై నడిపించారు. సంకీర్ణ రాజకీయాల కాలంలో ఢిల్లీలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారపీఠంపై కూర్చుండబెట్టారు. అత్యంత శక్తిమంతమైన మహిళానేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల దాకా దేశంలో సోనియా ప్రాభవం కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత మాత్రం సోనియా సాధారణ ప్రతిపక్షనాయకురాలిగానే మిగిలిపోయారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కూడా అంత చురుగ్గా పాల్గొనడం లేదు. ఎప్పటినుంచో అధ్యక్ష బాధ్యతలు కొడుకు రాహుల్ గాంధీకి అప్పగించాలని సోనియా భావిస్తున్నారు. అయితే రాహుల్ కు పార్టీపై అంత పట్టులేకపోవడం, ప్రధాని నరేంద్రమోడీ ప్రాభవంతో కాంగ్రెస్ బలహీనపడడంతో సమయం కోసం వేచిచూశారు.
ఆమె కోరుకున్నట్టుగా 2014 తర్వాత రాహుల్ క్రమక్రమంగా… బలమైన నేతగా ఎదిగారు. కాంగ్రెస్ ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తల్లిలానే ఒకప్పుడు అసమర్థనేత అనిపించుకున్న రాహుల్ ఇప్పుడు మాత్రం మోడీ తర్వాత దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతగా గుర్తింపు పొందారు. దీంతో రాహుల్ కు అధ్యక్షపీఠం అప్పజెప్పడానికి ఇదే సరైన సమయమని సోనియా భావించారు. పార్టీ నేతలనుంచి కూడా ఇలాంటి డిమాండే రావడంతో… కొడుకుని తన వారసుడి స్థానంలో కూర్చోబెడుతున్నారు. అయితే రాహుల్ అధ్యక్షుడయిన తర్వాత కూడా సోనియా కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషిస్తారనే అంతా భావించారు. బీజేపీలో అద్వానీలా కాంగ్రెస్ లో సోనియాను పక్కనపెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే కొత్త అధ్యక్షుడికి ఆమె తల్లి. వారసత్వంగానే కుమారుడికి పదవి అప్పచెప్పారు. అందుకే సోనియా ఇక మీదట కాంగ్రెస్ లో పాత తరం నాయకురాలిగా… రాహుల్ కు చేదోడు వాదోడుగా ఉంటారని అందరూ అనకుంటుండగా… ఆమె మాత్రం సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై వెళ్తూ మీడియాతో ఈ మాటలు చెప్పారు. వయసు పైబడడం, అనారోగ్యం కారణంగానే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతున్న సోనియా తరచుగా చికిత్స తీసుకుంటున్నారు. అటు సోనియా చేసిన జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.