Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ లో జరిగింది అహ్మద్ పటేల్ విజయం కాదు… మోడీ, అమిత్ షా ఓటమి అన్న వ్యాఖ్యానాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అహ్మద్ పటేల్ కు మమత శుభాకాంక్షలు చెప్పారు. గుజరాత్ లో జరిగిన మహాసమరంలో, ధర్మ యుద్ధంలో గొప్ప విజయం సాధించిన అహ్మద్ పటేల్ కు నా అభినందనలు అని మమత ట్వీట్ చేశారు. బిగ్ ఫైట్… గుడ్ ఫైట్..గుడ్ విన్ అంటూ ఆమె చేసిన ట్వీట్ మోడీ, అమిత్ షా లను పరోక్షంగా దెప్పిపొడిచినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా రాజ్యసభ ఎన్నికలంటే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను మాత్రం దేశం మొత్తం ఆసక్తిగా గమనించింది. ఈ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రిసార్టు రాజకీయాలు కూడా నడిచాయి. గెలుపు ఎలాగూ ఖాయమైన అమిత్ షా, స్మృతి ఇరానీ ఎన్నిక గురించి ఎవరికీ ఆసక్తి లేదు. సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో మోడీ, అమిత్ షా లు కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన బల్వంత్ సింగ్ రాజ్ పుట్ ను పోటీలో ఉంచి ఆయన గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. దీంతో కాంగ్రెస్ కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించి ఎలాగోలా అహ్మద్ పటేల్ ను గట్టెక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ స్థాయిలో బదనాం అయ్యాయి. రాజ్యసభలో ఓ స్థానం కోసం బీజేపీ అన్ని అధికారులను ఉపయోగించి కూడా ఫలితం దక్కక అభాసుపాలయితే…అహ్మద్ పటేల్ గెల్చినా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం లేదు.
గుజరాత్ లో వరదలొచ్చి…ఊళ్లకు ఊళ్లు తల్లడిల్లుతోంటే ఎమ్మెల్యేలను పరామర్శకు సైతం వెళ్లనీకుండా కోట్లు ఖర్చుపెట్టి రిసార్టుల్లో ఉంచి..అహ్మద్ పటేల్ ను గెలిపించటం ద్వారా పార్టీకి ఏం లాభం కలిగిందని సగటు కాంగ్రెస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నారు. అయితే అహ్మద్ పటేల్ విజయం ద్వారా కాంగ్రెస్ మోడీ, అమిత్ షాపై…తద్వారా బీజేపీపై మానసికంగా పై చేయి సాధించిందని, ఈ గెలుపు నిర్జీవంగా ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించటానికి ఉపయోగపడుతందని కొందరు నేతలు అంటున్నారు. తమకు ఎదురులేదన్నట్టుగా ప్రవర్తిస్తున్న మోడీ, అమిత్ షాలకు అహ్మద్ పటేల్ గెలుపు పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు మీడియాతో పెద్దగా మాట్లాడని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విజయం తరువాత మాత్రం స్పందించారు. ఈ ఎన్నికలు చాలా ఆందోళన కలిగించినప్పటికీ…అహ్మద్ విజయం ఊరటనిచ్చిందని ఆమె అన్నారు. క్రాస్ ఓటింగ్ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సోనియా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఈ విజయం కాంగ్రెస్కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతాబెనర్జీ అందుకే అహ్మద్ పటేల్ విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వార్తలు: