కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్ హీరోగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్. కోవిడ్ వేళ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఇప్పటికే ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. ఈ క్రమంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకురానున్న మెంటర్షిప్ కార్యక్రమానికి సోనూసూద్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. సోనూసూద్ శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ‘దేశ్ కా మెంటర్స్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. అయితే ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూసూద్ వ్యవహరించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది విద్యార్థులకు భవిష్యత్తు గురించి సరైన అవగాహన ఉండదు. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి అనే అంశాల గురించి తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. దీనికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ భేటీలో రాజకీయాల గురించి చర్చించలేదు’’ అని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తనకు శిక్షకుడి (మెంటర్) రూపంలో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని సోనూసూద్ తెలిపారు. పిల్లలుకు దిశానిర్దేశం చేయడం కన్నా మరో గొప్ప సేవలేదన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తాను అని సోనూసూద్ తెలిపారు.