త్వరలోనే వన్ నేషన్.. వన్ ఎలక్షన్

Soon One Nation .. One Election

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుతో పాటూ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్వాతంత్ర్య సమరయోధులకు, దేశం కోసం ప్రాణాలర్పించి ప్రతి ఒక్కరికి ప్రధాని మోదీ వందనాలు తెలిపారు. దేశంలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయని..

వరదల్లో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. అలాగే దేశ ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చామని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని.. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయని అన్నారు.

370, 35A రద్దు ద్వారా కాశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చామని అక్కడ అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాలన్నారు. లడక్‌లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని ఒకే దేశం ఒకే రాజ్యాంగం అన్న పటేల్ కల నెరవేరిందన్నారు.

గత ప్రభుత్వాలను ఆర్టికల్ 370పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘జీఎస్టీతో వన్ నేషన్.. వన్ ట్యాక్స్, వన్ నేషన్.. వన్ గ్రిడ్, వన్ నేషన్.. వన్ మొబిలిటీ కార్డ్‌‌లు సాధ్యమయ్యాయని.. త్వరలోనే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కూడా అమలు చేస్తామని అన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలపై దేశంలో విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు.