Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో అతనితో కెప్టెన్సీకోసం ప్రదానంగా పోటీపడిన జట్టు సహచరుల పేరులో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే పేర్లు చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా గంగూలీ కెప్టెన్ గా విఫలమయితే ఆయన స్థానంలో ద్రవిడ్ ను, కుంబ్లేను తీసుకురావడానికి సెలక్టర్లు సిద్ధంగా ఉండేవారు. దీంతో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా అండదండలతో గంగూలీ తన స్థానానికి పోటీదార్ల విషయంలో అనేక రాజకీయాలు చేసేవాడని అప్పట్లో వార్తలొచ్చేవి. ప్రదానంగా కుంబ్లే కు గంగూలీ ఎప్పుడూ పొగబెడుతుండేవాడని, తనతో కెప్టెన్సీ కోసం పోటీపడే స్థాయి నుంచి అతన్ని జట్టులో స్థానం కోసం పోరాడే స్థితికి నెట్టివేశాడని అప్పట్లో వినిపించిన ప్రదాన విమర్శ.
కుంబ్లేను అభద్రతాభావంలోకి నెట్టడానికే హర్భజన్ సింగ్ కు గంగూలీ వెన్నుదన్నుగా నిలిచాడని పలువురు ఆరోపించేవారు. ఈ విషయంపై కుంబ్లే ఎప్పుడూ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు కానీ.. కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ… 2003-04 ఆస్ట్రేలియా టూర్ తన కెరీర్ లోనే అతిపెద్ద సవాల్ గా నిలిచిన సందర్భమన్నాడు. ఆ సమయంలో తన కెరీర్ నిర్ణయాత్మక స్థితికి చేరుకుందని, తుది జట్టులో చోటు కోసం తాను హర్భజన్ సింగ్ తో పోటీపడాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. అప్పటికే తాను 30వ పడిలో ఉండడంతో తన రిటైర్మెంట్ పై చర్చ మొదలైందని, ఆ పరిస్థితుల్లో తానేదైనా కొత్తగా చేయాల్సిన అవసరం గుర్తించి గూగ్లీని ప్రయోగించానని తెలిపాడు. అప్పటి కుంబ్లే పరిస్థితిపై తాజాగా గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2003-04 ఆస్ట్రేలియా టూర్ కు టీమ్ ను ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ గా ఉన్న తాను కుంబ్లే కోసం సెలెక్టర్లతో చిన్నపాటి యుద్ధమే చేశానని గంగూలీ చెప్పుకొచ్చాడు. కుంబ్లేను పక్కనపెట్టాలని సెలక్టర్లు భావించారని, వారి నిర్ణయాన్ని తాను ఒప్పుకోలేదని, జట్టులో కుంబ్లే ఉండాల్సిందేనని తాను పట్టుబట్టానని గంగూలీ తెలిపాడు. దీనిపై దాదాపు రెండు గంటల పాటు వాగ్వాదం నడించిందని, అప్పటి కోచ్ జాన్ రైట్ తన వద్దకు వచ్చి ఇంతటితో దీన్ని వదిలేయాలని చెప్పినా తాను మాత్రం అంగీకరించలేదన్నాడు.
కుంబ్లేను తీసుకోకపోతే తానూ ఆ జట్టులో ఉండనని చెప్పేశానని దీంతో సెలక్టర్లు కుంబ్లేను జట్టులోకి తీసుకున్నారని వెల్లడించాడు. ఆస్ట్రేలియా టూర్ లో కుంబ్లే అద్భుతంగా రాణించాడని, ఆ ఒక్క ఏడాదే 80 వికెట్లు పడగొట్టాడని, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఏ స్పిన్నర్ కూడా అన్ని వికెట్లు తీయలేదని గంగూలీ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. గంగూలీ మాటలు అతనిపై వచ్చే ఆరోపణలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే కుంబ్లే సంగతి పక్కనపెడితే గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎంతో మంది యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకుని, వారిని అనేక విధాలుగా ప్రోత్సహించిన సంగతి మాత్రం నిజం. మాజీ కెప్టెన్ ధోనీ, యువరాజ్ సింగ్, కైఫ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు గంగూలీ ప్రోత్సాహం వల్లే క్రికెట్లో రాణించారు.