Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వయసుతో పాటు మనిషి ఆలోచనల్లో పరిణితి వస్తుంది. మాటల్లో అది వ్యక్తమవుతూ ఉంటుంది. తనకు ఎదురులేదన్నట్టుగా ప్రవర్తించే భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారత క్రికెట్ కెప్టెన్ హోదాకు అసలు సిసలు నిర్వచనం చెప్పిన దాదా… తర్వాతి తరానికి తన వైఖరితో కొత్త బాట చూపించాడు. గంగూలీ తర్వాత భారత కెప్టెన్ ల వ్యవహార శైలిలో అపార ఆత్మవిశ్వాసం కనిపించడానికి దాదా ప్రభావమే కారణం. భారత క్రికెట్ ను స్వర్ణయుగంలోకి నడిపించిన గంగూలీ… తన అంతర్జాతీయ కెరీర్ చివరిరోజుల్లో మాత్రం అవమానకర పరిస్థితుల్ని ఎదుర్కొని జట్టునుంచి నిష్క్రమించాడు. అయితే రిటైర్మెంట్ మినహా మిగిలిన ఆయన కెరీర్ అంతా సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న సమయంలో మ్యాచ్ ల్లో భారత్ పరాజయం పాలయినప్పడు తనపైనా, టీమిండియా పైనా కామెంటేటర్లుగా మారిన మాజీ క్రికెటర్లు చేసే విమర్శలను పట్టించుకునేవాడు కాదు గంగూలీ.
ఒకప్పుడు క్రికెట్ ఆడి ఇప్పుడు ఉపాధికోసం కామెంటేటరీ చేస్తున్న వారి వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. అప్పటి ఆయన మాటలు చూస్తే భవిష్యత్తులో క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గంగూలీ ఖాళీగా అయినా ఉంటాడేమో కానీ… కామెంటరీ మాత్రం చెప్పడని అంతా భావించారు. కానీ విచిత్రంగా రిటైర్మెంట్ ప్రకటించిన రెండేళ్లకే కామెంటేటర్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు బెంగాల్ టైగర్. ఆ తర్వాత ఆయన క్రికెట్ పాలనారంగంలో అడుగుపెట్టి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఇలా ఊహించని విధంగా సాగిపోతున్న తన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు సౌరవ్. ఆటగాడిగా కెరీర్ ముగిశాక తాను భారత జట్టుకు కోచ్ కావాలని భావించానని, అయితే అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ పాలకుడిగా మారానని గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ తన వైఖరికి భిన్నంగా వేదాంత ధోరణిలో మాట్లాడాడు. ఫలితం గురించి ఆలోచించకుండా మన వల్ల ఏది సాధ్యమవుతుందో అది చేయాలని, జీవితం ఎటువైపు వెళ్తుందో, మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలియదని దాదా వ్యాఖ్యానించాడు.
1999లో తాను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత జట్టుకు సచిన్ కెప్టెన్ అని, తానప్పుడు వైస్ కెప్టెన్ కూడా కాదని, మూడు నెలలు తిరిగే సరికల్లా తాను జట్టు పగ్గాలు అందుకున్నానని వెల్లడించాడు. అలాగే రిటైర్మెంట్ తర్వాత కోచ్ కావాలనుకున్నానని, కానీ దాల్మియా పిలిచి ఆరు నెలలు క్యాబ్ లో ఉండమన్నాడని, ఆయన చనిపోయినప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ లేకపోవడంతో తాను ఆ పదవిని చేపట్టాల్సి వచ్చిందని సౌరవ్ తెలిపాడు. మామూలుగా ఓ కొత్త వ్యక్తి క్యాబ్ అధ్యక్షుడు కావడానికి 20 ఏళ్లు పడుతుందని, కానీ తాను కొన్ని నెలల్లోనే ఈ గౌరవాన్ని సాధించానని గంగూలీ అన్నాడు. ఇలా ఊహించంది జరగడమే జీవితమన్నాడు. మొత్తానికి దాదా వ్యాఖ్యలు చూస్తుంటే వయసుతో పాటు మనిషి ఆలోచనల్లో, మాటల్లో మార్పు వస్తుందన్నది నిజమే అనిపిస్తుంది.