థియేటర్ల బంద్‌ ఎప్పటి వరకు?

South India Cinema theatres bandh continue to March 3rd week

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో కూడా సినిమా థియేటర్ల బంద్‌ కొనసాగుతుంది. డిజిటల్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గించే వరకు బంద్‌ కొనసాగుతుందని నిర్మాత సురేష్‌బాబు మొదటే ప్రకటించిన విషయం తెల్సిందే. మూడవ రోజు కూడా ఏ ఒక్క థియేటర్‌ కూడా తెరుచుకోలేదు. మార్చి 2 నుండి ప్రారంభం అయిన బంద్‌ ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే మార్చి చివర్లో పెద్ద సినిమాలున్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్పటి వరకు బంద్‌ను ఎత్తి వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిజిటల్‌ ప్రొవైడర్లు మొండిగా వ్యవహరించినా కూడా మార్చి మూడవ వారం వరకు బంద్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు మరియు సినిమా పరిశ్రమ పెద్దలు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 15 నుండి 20వ తేదీ మద్యలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు 20 నుండి 30 శాతం మేరకు రేటును తగ్గించేందుకు ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అంతకు మించి కావాలి అనేది నిర్మాతల డిమాండ్‌. మార్చి మూడవ వారం వరకు డిజిటల్‌ ప్రొవైడర్లు మారకుంటే ఆ 20 నుండి 30 శాతం తగ్గింపుతోనే బంద్‌ను ఎత్తి వేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అందుకే మార్చి చివర్లో విడుదల కావాల్సిన సినిమాలకు ఎంలాంటి ఆందోళన లేదు. మార్చి చివరి నుండి మళ్లీ సౌత్‌ ఇండియాలో సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు, విడుదలకు కూడా సిద్దంగా ఏమీ లేవు. అందుకే టాలీవుడ్‌ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ప్రశాంతంగా ఉన్నారు.