ఆంధ్రా ఎంపీలు చేసిన పనికి పార్ల‌మెంట్ వాయిదా…

TDP and YSRCP MP's Protest in Parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లూ రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. విభ‌జ‌న హామీలు అమ‌లుచేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు చేసిన ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య‌స‌భ‌లు అట్టుడికాయి. దీంతో లోక్ స‌భ స్పీక‌ర్ రెండుసార్లు స‌భ‌ను వాయిదావేశారు. తిరిగి స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ప‌రిస్థితిలో మార్పులేక‌పోవ‌డంతో రేప‌టికి వాయిదా వేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల‌తో పాటు టీఆర్ ఎస్ స‌భ్యులు, త‌మిళ‌నాడు ఎంపీలు కూడా ఆందోళ‌న‌కు దిగారు. ఏపీకి న్యాయంచేయాల‌ని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేయ‌గా, రిజ‌ర్వేష‌న్ల కోటా పెంచాల‌ని టీఆర్ ఎస్ ఎంపీలు స్పీక‌ర్ పోడియం వ‌ద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కావేరీ జ‌లాల వివాదంపై త‌మిళ‌నాడు ఎంపీలు నిర‌స‌న తెలిపారు. ఈ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, టీఆర్ ఎస్, ఏఐడీఎంకె స‌భ్యుల నినాదాల‌తో లోక్ స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. స‌భ న‌డిపే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో సుమిత్రా మ‌హాజ‌న్ రేప‌టికి వాయిదా వేశారు.

రాజ్య‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. స‌భ ప్రారంభం కాగానే ఆంధ‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాలంటూ ప‌లువురు ఎంపీలు రాజ్య‌స‌భ‌లో ఆందోళన నిర్వ‌హించారు. దీంతో రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంకయ్య‌నాయుడు స‌భ‌ను కాసేపు వాయిదా వేశారు. అనంత‌రం 11.20నిమిషాల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మైంది. అప్పుడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ్యులు ఆందోళ‌న కొన‌సాగించారు. దీంతో వెంక‌య్య‌నాయుడు స‌భ్యుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మ‌నం పార్ల‌మెంట్ లోనే ఉన్నామా… ఇంకెక్క‌డ‌యినా ఉన్నామా… అని వ్యాఖ్యానించారు. స‌భ్యుల‌ వ్య‌వ‌హార‌శైలిని దేశ‌మంతా చూస్తూ ఉంటుంద‌ని… సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. చైర్మ‌న్ వ్యాఖ్య‌లు ప‌ట్టించుకోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు వెల్ వ‌ద్ద ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన వెంకయ్య‌నాయుడు ఈ చ‌ర్య‌లు స‌భాసంప్ర‌దాయాల‌కు వ్య‌తిరేక‌మ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పితే చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. అయినా స‌భ్యులు విన‌క‌పోవ‌డంతో రాజ్య‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు వాయిదావేశారు. స‌భ తిరిగి ప్రారంభ‌మైన తర్వాత కూడా ప‌రిస్థితిలో మార్పురాలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయంచేయాల్సిందేనంటూ ఏపీ ఎంపీలు ఆందోళ‌న కొన‌సాగించారు. డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ ఎంత‌గా వారించినా… స‌భ్యులు వినిపించుకోలేదు. అదే స‌మ‌యంలో కావేరీ జ‌లాల వివాదంపై అన్నాడీఎంకె స‌భ్యులు సైతం ఆందోళన చేప‌ట్ట‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స‌భను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్టు కురియ‌న్ ప్ర‌క‌టించారు.