హోదా పై రాహుల్ ప్రకటనతో బీజేపీ లెక్కలు తప్పాయి.

Rahul Gandhi Support to AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కడానికి ప్రధాని మోడీ సాహసించడానికి బీజేపీ వేసుకున్న రాజకీయ లెక్కలే. ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా బీజేపీ కి వచ్చేదీ, పోయేది ఏదీ లేదని మోడీ, షా అంచనా. పైగా వేర్వేరు కారణాలతో టీడీపీ, వైసీపీ ఏది ఎక్కువ సీట్లు సాధించినా తమ చెంతకే చేరతాయని వాళ్ళ నమ్మకం. అందుకే ఏపీ విషయాన్ని వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో బీజేపీ లెక్కలు తప్పడం ఖాయం అనిపిస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాహుల్ గాంధీ ఆ వేదిక నుంచి డిమాండ్ చేయడమే గాకుండా 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే బిల్లు మీద తొలిసంతకం చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఒక్క శాసనసభ సభ్యుడు కూడా లేని రాష్ట్రం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చాక మోడీకి కొత్తగా ఓ ఇబ్బంది వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా తమకే మద్దతు ఇస్తారన్న భ్రమలు తొలిగిపోయాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధిష్టానం మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయన్న డౌట్ వుంది. దానికి తోడు రాహుల్ తాజా ప్రకటన తర్వాత వైసీపీ సైతం పునరాలోచనలో పడే ఛాన్స్ వుంది. కేసుల కోసం బీజేపీ భజన చేస్తున్నప్పటికీ ఆ పార్టీతో జరిగే నష్టం ఏమిటో ఇటీవల వైసీపీ స్వయంగా చేయించుకున్న సర్వే లో వెల్లడి అయ్యిందట. బీజేపీ తో సాన్నిహిత్యం ఆత్మహత్య సదృశ్యం అని సర్వే లో వెల్లడి అయ్యిందట. అందుకే అనూహ్యంగా చివరిదాకా బీజేపీ ని ఊరించి కాంగ్రెస్ తో వైసీపీ కలిసినా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా చూస్తే బీజేపీ లెక్కలు తప్పినట్టే కదా !