కాంగ్రెస్ కి షాక్…. చేతులు కలిపిన అఖిలేష్‌, మాయావతి…?

Sp And Bsp Deal Big Shock For Congress In Uttar Pradesh

దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి మోదీని ఎలాగైనా గద్దె దించాలని చూస్తున్న కాంగ్రెస్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఎందుకంటే యూపీలో మారుతున్న సమీకరణలే దానికి కారణం. నిజానికి లోక్ సభ ఎన్నికలు వస్తే అందరి చూపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ఇక్కడ మెజారిటీ స్థానాల్లో గెలవాలని చూస్తాయి. గత ఎన్నికల్లో బీజేపీ దాదాపు 70 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా బీజేపీ దూకుడికి కళ్లెం వేయాలని చూస్తోంది. దానికి తగ్గట్టే ఎస్పీ, బీఎస్పీ పార్టీలతో దోస్తీ చేస్తుంది. అయితే ఎస్పీ, బీఎస్పీ మాత్రం యూపీలో కాంగ్రెస్ ని ఒంటరిని చేసి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్‌ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు కూటమిగా ఏర్పడి సీట్ల పంపకం కసరత్తును కొలిక్కితెచ్చాయని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు బలమైన రాజకీయ శక్తులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు ఆర్‌ఎల్‌డీతో కలిసి ఈ కూటమి ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్రం నుంచి ప్రచురితమవుతున్న హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ వెల్లడించింది. తక్కువ స్ధానాలతో సరిపెట్టుకుంటామని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొనడంతో సీట్ల సర్దుబాటు సులభంగా పూర్తయిందనట్లు సమాచారం. ఎస్పీ కంటే ఒకటి రెండు స్ధానాల్లో అధికంగా బీఎస్పీ బరిలో ఉండేలా సీట్ల పంపకం జరిగినట్లు తెలుస్తోంది. 39 స్ధానాల్లో బీఎస్పీ, 37 స్ధానాల్లో ఎస్పీ, 2 స్ధానాల్లో ఆర్‌ఎల్డీ పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు ఖరారైనట్టు సమాచారం. అయితే కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నా లేకున్నా రెండు స్ధానాలను కాంగ్రెస్‌కు వదిలేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు వదిలేసిన ఆ రెండు సీట్లు కూడా రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, సోనియాగాంధీ సొంత సీటు రాయ్‌బరేలీ కావడం గమనార్హం. మిత్రపక్షాలతో కలిసి కనీసం 15 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తేనే కూటమికి అనుకూలమని ఎస్పీ, బీఎస్పీలు భావిస్తున్నాయట. చూద్దాం మరి మున్ముందు ఏం జరుగుతుందో.