ప్రముఖ గాయకుడు ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో స్మారకమందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎస్పీబీ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వున్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు.
ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో ఆదివారం కుటుంబసభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చరణ్, తామరపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో ఎస్పీబీ స్మారక మందిరం నిర్మించనున్నట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారంలోపు మీడియాకు వివరిస్తామన్నారు. తండ్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వానికి, కలెక్టర్ మహేశ్వరి, పోలీసులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మారక మందిరం నిర్మాణానికి ముందే ఎస్పీబీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని ప్రజలు సందర్శించడానికి పోలీసులతో చర్చించిన తరువాత అనుమతిస్తామని వివరించారు.