అచ్చెన్న మీద స్పీకర్ ఫైర్

speaker fire on acchennayudu

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పేర్ని నాని ఆటో డ్రైవర్లకు సంబంధించి అంశాలపై ప్రకటన చేస్తుండగా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. రేపల్లె ఎమ్మెల్సీ అనగాని సత్యప్రసాద్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో ఈ వివాదం రేగింది. తనను పడుకొని ఇప్పుడే వచ్చావా.. బట్టీ పట్టావా అంటూ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాని కౌంటరిచ్చారు. ఈ సందర్భంలో టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్న ప్రస్తావనను మంత్రి తీసుకొచ్చారు. తనకు సంబంధం లేని అంశంలో.. తన పేరును ఎలా ప్రస్తావిస్తారని అచ్చెన్న మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. తనపాటికి తాను ప్రశ్నల గురించి చదువుకుంటుంటే.. టెక్కలి అంటూ ఎందుకు మంత్రి ప్రస్తావించారని ప్రశ్నించారు. తనను ఉద్దేశిస్తూ అసభ్యకరంగా మాట్లాడారని.. తాను రౌడీయిజం చేశానని అన్నారని.. బయటకు రా నీ సంగతి తేలుస్తామని బెదిరించడం సబబు కాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రవర్తన తప్పుగా ఉంటే సభకు కూడా రానని అన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. మచిలీపట్నంలో కాదు టెక్కలిలో కూడా అంతే అంటూ తాను వ్యాఖ్యానించానని.. ఎందుకు అసెంబ్లీకి పంపించారని అందరూ అనుకుంటారన్నరని అన్నానే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. స్పీకర్ రికార్డుల్ని పరిశీలించి తాను తప్పుగా మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ టీడీపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. క్షమాపణలు చెప్పాలని, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో నినాదాలతో హోరెత్తించారు.  సభలో గందరగోళం ఏర్పడటంతో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు చొరవ తీసుకున్నారు. అచ్చెన్నాయుడుకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ కూడా అచ్చెన్నకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. స్పీకర్ త్వరగా ముగించాలని కోరారు. వెంటనే అచ్చెన్న.. ‘మీరు రాసివ్వండి నేను చదువుతాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుందాగా ప్రవర్తించాలని హెచ్చరించారు. అచ్చెన్న వ్యాఖ్యలపై వైసీపీ సభ్యలు మండిపడ్డారు. ఆయన స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చెన్న వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబును స్పీకర్ ప్రశ్నించగా.. వైసీపీ సభ్యుల తీరును కూడా మీరు సమర్థిస్తున్నారా అంటూ చంద్రబాబు అడిగారు. సభలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలన్న ప్రతిపక్ష నేత. అందరం కలిసి సభను సజావుగా సాగేలా చూడాలని స్పీకర్‌ను కోరారు.